ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. గత సీజన్‌లో రైతు పండించిన ఏ పంటకూ కనీస మద్దతు ధర కూడా రాక...రైతాంగం అప్పుల మూట భుజాన వేసుకుని, భారంగా ఖరీఫ్ సీజన్‌కు సిద్ధం అవుతున్నది. ఇటువంటి స్థితిలో మే నెలలోనే ప్రభుత్వం రెండు సార్లు ఎరువుల ధరలు పెంచింది. గల్ఫ్ యుద్ధం పేరుతో మరొకసారి ఎరువుల ధరలు పెంచబోతున్నదనే వార్తలు రైతాంగాన్ని కలవర పరుస్తున్నాయి. గత ఏడాది యూరియా బ్లాక్ మార్కెట్టుకు తరలగా రైతాంగం పడిగాపులు కాసిన స్థితి ఇంకా మరిచిపోలేదు.
దాని నుండి గుణపాఠం నేర్వని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువుల పంపిణీకి నూతన విధానం ప్రకటించింది. ఎ.పి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మోనిటరింగ్ సిస్టమ్ పేరిట ''యాప్''ను సిద్ధం చేసింది. ఈ యాప్ లో ధృవీకరణ అయిన రైతులకు సీజన్లో మూడు విడతలుగా యూరియా, డి.ఎ.పి ఎరువులను కోటా ప్రకారం ఇస్తారు. ఈ పథకాన్ని రాష్ట్ర అధికారుల సమావేశంలో ప్రకటించడం మరింత ఆందోళనకరం. ఈ యాప్‌లో ధృవీకరించాలంటే ప్రతి రైతుకు స్మార్ట్ ఫోను, నెట్ కనెక్షన్ ఉండాలి. దానిని ఉపయోగించడం తెలిసి వుండాలి. ఇది పేద, మధ్య రైతు, కౌలు రైతులకు సాధ్యం కాని విషయం. 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎరువులపై నియంత్రణ తొలగించింది.
కంపెనీలు ఎరువుల ధరలను ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. యూరియాకు మాత్రమే కంట్రోలు వుంచింది. యూరియాకు అవసరమైన సబ్సిడీ ఇస్తూ వచ్చింది. అప్పటి నుండి యూరియా వాడకం పెరిగింది.
2023లో కేంద్ర బిజెపి ప్రభుత్వం 'పి.ఎం-ప్రణామ్' పేరుతో నూతన ఎరువుల చట్టం తెచ్చింది. ఎరువులపై ఇచ్చే సబ్సిడీ యాభై శాతం తగ్గించాలని నిర్ణయించింది.
అందుకు గాను యూరియా వాడకం తగ్గించాలని, యూరియా స్థానంలో లిక్విడ్ నానో యూరియా వాడాలని పేర్కొంది. 30 శాతం యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడాలని నిర్ణయించింది. యూరియా స్థానంలో నానో యూరియా వాడాలన్న ప్రతిపాదన చేయడంతోపాటు...యూరియా తయారీ సంస్థలైన సింద్రీ, గోరఖ్‌పూర్, తాల్చేర్ ఫ్యాక్టరీలను తెరవకుండా మూసివేసింది.
ఎరువుల కంపెనీలు ఒక బస్తా యూరియాకు ఒక సీసా నానో లిక్విడ్ కొనాలని షరతు విధించాయి. యూరియాలో 45 శాతం నత్రజని ఉంటుంది. లిక్విడ్ నానోలో 4 శాతం మాత్రమే నత్రజని వుంటుంది. నానో యూరియాను ఏ అధికారిక పరిశోధనా సంస్ధ ధృవీకరణ చేయలేదు. నానో లిక్విడ్ వాడిన పొలాల్లో వరి దిగుబడి 13 శాతం, గోధుమ దిగుబడి 21 శాతం తగ్గిందని పంజాబ్ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. నానో వాడిన వరిలో 24 శాతం, గోధుమలో 35 శాతం ప్రొటీన్ తక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. ఒక ఎకరంలో యూరియా చల్లటానికన్నా నానో స్ప్రే చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గించుకున్న రాష్ట్రాలకు బస్తాకు రూ.800 ముదరా ఇస్తామని ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు 10 శాతం తగ్గించుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30 శాతం తగ్గించుకుంది. ఫలితంగా రైతాంగం యూరియా కోసం పడిగాపులు కాయటం, ఎరువులు విచ్చలవిడిగా బ్లాకు మార్కెట్టుకు తరలటం గత ఏడాది అనుభవం.
ఈ ఏడాది ఇప్పటికే ఎరువుల ధరలు రెండుసార్లు పెంచి, యుద్ధం పేరుతో మూడవసారి పెంచచూడటం రైతాంగం పట్ల ప్రభుత్వాల వైఖరికి అద్దం పడుతున్నది.
విమాన ప్రయాణికులకు భారం అవుతుందని విమాన ఇంధన ధర 20 శాతం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, మరొకసారి విమాన ఇంధన ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. విమాన ప్రయాణికుల మీద వున్న ప్రేమ దేశానికి అన్నం పెట్టే రైతులపై లేకపోవటం బి.జె.పి ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తున్నది.
గత ఏడాది రైతులు ఇబ్బందులు పడిన అనుభవం వున్నా, రాష్ట్ర ప్రభుత్వం యాప్ విధానం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? ఈ యాప్ పథకం రైతులను మరింత కష్టాలపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యాప్ పథకాన్ని ఉపసంహరించుకొని, రాష్ట్రానికి అవసరమైన యూరియా, డి.ఎ.పి లను రాబట్టుకొని, ఎరువులు బ్లాక్ మార్కెట్టుకు తరలకుండా చర్యలు తీసుకోవాలి.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండగా ఎరువుల ధరలు 25 శాతం పెంచటంతో పాటు...ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎరువుల వాడకం 50 శాతం తగ్గించుకోవాలని, రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని, సేంద్రీయ ఎరువులు వాడాలని హితవులు చెప్పటం బిజెపి కూటమి ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుంది.
ప్రధానమంత్రి చెప్పిందే వేదంగా భావిస్తున్న మన ముఖ్యమంత్రికి ఎరువుల కోత విధించటానికి యాప్ ఆలోచన తట్టినట్టు ఉంది. యాప్ మాటున ఎరువుల వాడకం తగ్గించడం తప్ప మరొకటి కాదు. యాప్ విధానం రైతులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది.

- వ్యాసకర్త: వై. కేశవరావు, సీనియర్ రైతు నాయకులు








కామెంట్‌లు (0)