mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుష్కర ప్రచారం, పొంచిన ప్రమాదం

5 రోజుల క్రితం

bjp govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 06:15 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించి, కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనే మోత మోగిపోతున్నది. మోడీ దేశంలోనే గాక ప్రపంచంలోనే సాటిలేని నాయకుడనీ, 21వ శతాబ్దం ఆయనదేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న ఎన్‌డిఎ సమావేశంలో పొగిడేశారు. బడా మీడియాలో చాలా మంది వ్యాఖ్యాతలు తమ శక్తిని బట్టి మోడీ భజనలో మునిగి తేలుతున్నారు. గూగుల్‌ సెర్చి కొడితే తొంభై శాతం కీర్తనలే తప్ప విమర్శనాత్మక రచనలు కనిపిస్తే ఒట్టు. ఆఖరుకు ఎ.ఐ చాట్‌ జిపిటి వంటివి కూడా అదే పాట. ఎన్నికల్లో గెలిచి మధ్యలో అంతరాయం లేకుండా అతి ఎక్కువ కాలం పాలించినవారి వివరాలను బట్టి ఈ లెక్క వేసినట్టు గూగుల్‌ సెర్చి ఎ.ఐ చెబుతుంది. ఆ సెర్చి ప్రకారమైతే మోడీ ప్రధానిగా 4400 రోజులు పూర్తి చేశారని మాత్రమే గాక గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన 4600 రోజులు కూడా కలిపి దేశంలోనే అత్యధిక పాలనా కాలం గల నేతగా 9000 రోజులు లెక్క చూపిస్తున్నది. ఇలా రెండూ కలిపి చూపడం ఎంతవరకు సమంజసమనేది ఒకటైతే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ నేరుగా ఎన్నికల్లో గెలవలేదని కూడా చెప్పుకోవాలి మరి. గుజరాత్‌ మారణకాండ నేపథ్యంలో మొదటి దఫానే ఆయన సభను అర్థంతరంగా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని అందరికీ తెలుసు. అయినా అవన్నీ మాకు అవసరమేమిటి? మోడీనే హయ్యెస్ట్‌.
జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 ఆగష్టు 15 నుంచి 6130 రోజులు నిరాఘాటంగా పాలించారు. 1964లో పదవిలో వుండగానే కన్నుమూశారు. ఇందిరా గాంధీ ఒక విరామంతో 5831 రోజులు పాలించారు. సిక్కు ఉగ్రవాది హత్య చేయడం వల్ల ఆమె పదవీ కాలం ముగిసింది. కాకపోతే ఎమర్జన్సీ తర్వాత 1977-80 మధ్య ఇందిరా గాంధీ ఓడిపోయారు. అయినా మొత్తం రోజులు లెక్క వేస్తే మోడీకి చెబుతున్న దానికంటే వేయి రోజులు ఎక్కవ. ఎ.పి లో చంద్రబాబు నాయుడు 2004, 2009, 2019లో మూడుసార్లు ఓడిపోయారు. అయినా స్కోరు మాత్రం అత్యధిక కాలం అని చెబుతూనే వున్నాం కదా. నెహ్రూ ఇందిరలకు అది వర్తించదా? నెహ్రూ 1947లో ఎన్నికైన ప్రధాని కాదనేది మరింత తప్పు వాదన. వాస్తవానికి దేశ స్వాతంత్య్రంపై చర్చలు మొదలైనాక బ్రిటిష్‌ క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌ కింద 1946 జులై-ఆగష్టులో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 296 స్థానాలకు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఇందులో 208 కాంగ్రెస్‌ పార్టీనే గెల్చుకుంది. ముస్లిం లీగ్‌ 73 స్థానాలను తెచ్చుకుంది. ఇవిగాక మరో 93 స్వదేశీ సంస్థానాధీశులకు కేటాయించారు. దేశ విభజన, స్వాతంత్య్రానంతరం నెహ్రూను ప్రధానిని చేయడం ఈ బలాన్ని బట్టి తప్ప ఏదో నియామకం కాదు. పైగా 1949లో రాజ్యాంగ పరిషత్తును తాత్కాలిక పార్లమెంటుగా నిర్ణయించారు.1952 ఎన్నికలకు కూడా ఆ రాజ్యాంగమే పునాది. నెహ్రూ స్వాతంత్య్రోద్యమ అత్యున్నత నేతలలో ఒకరుగా వున్నారు గనక ఇది మామూలు ఎన్నిక కంటే ఎక్కువే. మోడీ గొప్ప కోసం ఆ అయిదేళ్లు తుడిచేసి ఆయనే గొప్ప అని టముకు వేసుకుంటున్నారు.


కంగుతిన్న బిజెపి కవరప్‌
వాస్తవానికి 2024లో మోడీ-బిజెపి స్వంతంగా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు. టిడిపి, జెడియుల ప్రధాన మద్దతుపైనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. 400 స్థానాలు వచ్చేస్తాయని కోతలు కోసి 240 దగ్గరే ఆగిపోవడం శృంగభంగమైంది. అప్పటి నుంచి కొత్త కవరప్‌ థియరీలు పెరిగాయి. ఈ విన్యాసం ఎన్నికల ఫలితాలు రాకముందే మొదలైంది. రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గత ప్రభుత్వమే చర్చకు పెట్టడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మూడు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం, యువతకు సహాయపడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, కొత్త పెన్షన్‌ పథకం, 11 లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయం ఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ, స్పష్టత లేనివే. నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో వుంటే వారి పేరిట కార్పొరేట్లకు నెల జీతం జమ చేయడం ఓ విపరీత విధానం. విదేశాంగ విధానంలోనూ గొప్ప ఫలితాలు సాధించినట్టు చెప్పుకున్నారు. ఇవన్నీ 2024 దెబ్బను మరపించేందుకు పడిన తంటాలే, మామూలుగా గెలిచే అవకాశం లేదు గనకే 'సర్‌' తతంగంతో రాష్ట్రాలలో కృత్రిమంగా గెలిచే ప్రయత్నాలు అవసరమైనాయి. జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన వంటివన్నీ ఆ కోనసాగింపే. వీటివల్ల ఏదో విధంగా రాష్ట్రాలలో తిష్టవేసినా ట్రంప్‌, నెతన్యాహూ ఇరాన్‌పై దురాక్రమణకు పాల్పడటంతో పరిస్థితి మొత్తం తలకిందులై పోయింది. మోడీ విశ్వగురు గొప్పలు కుప్పకూలాయి.

అప్పుడే మొదలు...
తమ సంస్థకు ఎవరూ దేవుడు కాదనీ, ఎప్పుడూ ఒకరినే తాము నెత్తిన పెట్టుకోమని కూడా మోహన్‌ భగవత్‌ వంటి వారు ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్యాపదేశంగా మోడీకి సంకేతాలు పంపారు. ఆరెస్సెస్‌ వారికి ప్రాథమికంగా అధికారం చలాయించడం, మతతత్వ ఎజెండా చలామణి చేయడం ముఖ్యం. ఏదో విధంగా తమ అసంతృప్తినీ కొరతనూ బయిటపెట్టడానికి అదే సమయంలో తమ మధ్య ఏదో తేడా వుందనే భ్రమ కలిగించడానికి చాలా మాట్లాడారు. నాగపూర్‌కు అంటే ఆరెస్సెస్‌ కేంద్ర స్థానానికి ఇష్టుడైన మాజీ బిజెపి అథ్యక్షుడు, మూడో దఫా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఒకడుగు ముందుకేసి తనకు ఒకసారి ప్రధాని పదవి ఆఫర్‌ వచ్చినట్టు బహిరంగంగా ప్రకటించారు. ప్రతిపక్షాలు ఆ ఆఫర్‌ ఇచ్చాయట. మోడీ నాయకత్వాన్ని ఎందుకు వదలిపెడతాను అని ఆయన అన్నప్పటికీ ఈ విషయం బయిట పెట్టడంలోనే అసలు వ్యూహం వుంది. ఇదేగాక మూడోసారి ఎన్నికల తర్వాత బిజెపి నేతలు ఇష్టానుసారం మాట్లాడటం, కంగనా రనౌత్‌, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌తో సహా పలువురు ఆంక్షలకు గురికావడంలో అసహనం ప్రతిబింబించింది. రాహుల్‌ గాంధీని దేశంలోనే మొదటి టెర్రరిస్టు అని కేంద్రమంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ దూషించారు. ఇలాగే మాట్లాడితే మీ నానమ్మ గతే మీకు పడుతుందని మరో నేత బెదిరించారు. సీనియర్‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా రాహుల్‌పై తిట్లు కురిపించి కృతజ్ఞత చాటుకున్నారు. ప్రతిపక్ష కూటమిపైన రోజూ నిందారోపణలు చేయడం మూడో దఫా పాలనలో బిజెపికి నిత్యకృత్యమైపోయింది.
మరోవైపున మోడీ 3.0 ప్రభుత్వం పరిస్థితులకు తగినట్టు మారిందని ముందుకు పోతోందని 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రిక అప్పట్లో బాక్స్‌ కథనం ప్రచురించింది. పున:శక్తివంతం కావటం, మరింతగా నిలదొక్కుకోవడం జరుగుతుందంటూ ఆ కథనం మొదలైంది. భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలకు చోటు కల్పించేందుకు ఒక కొత్త రాజకీయ ప్రక్రియను రూపొందించుకోవాల్సి వచ్చినా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో విజయాలు సాధించడం ద్వారా బిజెపి తన ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోగలిగిందని చెప్పింది. ఇప్పట్లా 12 ఏళ్ల దాకా ఆగకుండానే ఆర్‌.జగన్నాథన్‌ (స్పాన్సర్డ్‌గా కనిపించే 'స్వరాజ్య' సంపాదకుడు) 11 ఏళ్లలో 11 మార్పుల జాబితా ఇచ్చేశారు. దేశంలో మతపరమైన అస్తిత్వాన్ని నెలకొల్పడం, మైనార్టీలు ప్రతిపక్షం వైపు మొగ్గకుండా చూడటం మోడీ ఘనతని పొగిడారు. మొదటిసారిగా బిజెపి ఒక రాజకీయ పార్టీని కార్పొరేట్‌ పద్ధతిలో నడపవచ్చునని అగ్ర నాయకుడు సీఈఓ లాగా ఉంటే కార్యకర్తలు ఉద్యోగులుగా కనిపిస్తున్నారని వర్ణించారు. పైనుంచి కిందకు ప్రమోషన్లతో వినియోగ సరుకుల (ఎఫ్‌.ఎం.సి.జి) తరహాలో రాజకీయం నడపవచ్చునని అర్థమైందట. మోడీకి అనుకూలంగా పది అంశాలు చెప్పిన జగన్నాథన్‌ ఆఖరులో మాత్రం ఉద్యోగాల కల్పన అనే అతి ప్రధానమైన జాతీయ సవాలు మోడీ పాలనలో అలాగే ఉండిపోయిందని ఒప్పుకోక తప్పలేదు. సరిగ్గా ఇదే ఇప్పుడు గుదిబండగా మారుతున్నది. నిరుద్యోగ బొద్దింకల నిరసనలు కుదిపేస్తున్నాయి.

పెను దాడికి సంకేతం...
ఈ సమయంలో ఎన్నికల కమిషన్‌, న్యాయ వ్యవస్థ, పార్లమెంటు సహా అన్నీ సంఘర్షణకు గురవుతున్నాయి. వీటిని ప్రత్యర్థులపైనేగాక ఎన్‌డిఎ భాగస్వాములపైనే ప్రయోగించడం చూస్తున్నాం. బీహార్‌లో నితీశ్‌బాబు ఇంటి దారి పట్టేశారు. పవన్‌ ఎంతగా వత్తాసు పలికినా తెలంగాణలో తాము వంటరిగానే పోటీ చేస్తామని అమిత్‌ షా ప్రకటించారు. స్వంత బలం పెంచుకోవడం తప్ప ప్రాంతీయ పార్టీలపై ఆధారపడబోమన్నారు. ఇప్పుడు చంద్రబాబు మినహా పెద్ద రాష్ట్రాలలో బిజెపి యేతర ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి ఎన్‌.డి.ఎ లో లేరు. ఆయన స్థానంలో వస్తాడంటున్న లోకేశ్‌పై ఇప్పటికే మోడీ బహిరంగంగా ప్రత్యేకాసక్తి చూపిస్తున్నారు. ఎన్‌.సి.పి, శివసేన, జె.డి.ఎస్‌, ఆప్‌ సహా పలు ప్రాంతీయ పార్టీలను బిజెపి చీల్చింది. తృణమూల్‌ ముక్కలై పోవడం, పెద్ద సంఖ్యలోఎంపీలు వచ్చి ఎన్‌.డి.ఎ ను బలపర్చడం కూడా ఈ రాజకీయ మాయాజాలంలో భాగమే. మొన్నటి నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశాలు జరిపి కలసి పని చేయాలని కోరడంలోనూ సంకేతాలున్నాయి. రేవంత్‌ రెడ్డి తమతో చేతులు కలుపుతారని బిజెపి నేతలు ప్రచారం చేస్తుంటే బి.ఆర్‌.ఎస్‌ దెప్పి పొడుస్తున్నది. ఆ స్థాయిలో సిఎంఓ ఖండనలు ఇవ్వడం లేదు. పదవి లోని ఒక ముఖ్యమంత్రి తేలిగ్గా అటు చేరిపోతారనే ప్రచారం నమ్మశక్యం కాకున్నా సందేహాలు సాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వెనక కాంగ్రెస్‌ నేతలే వున్నారన్న ఆరోపణ దుమారం రేపింది. విచిత్రంగా మరోవైపున కాంగ్రెస్‌ నుంచి గతంలో విడిపోయిన ఎన్‌.సి.పి, తృణమూల్‌ వంటివి మళ్లీ విలీనం అవుతాయనే ప్రచారాలూ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో వై.సి.పి పేరు కూడా వినిపిస్తున్నా ఆ అవకాశం వుండదనే అభిప్రాయం బలంగా వుంది. పైగా జగన్‌ పిఏతో సహా అతి సన్నిహితులపైనా లిక్కర్‌ కుంభకోణంలో దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇవి ఆయన దాకా రావచ్చనే కథనాలూ వున్నాయి. పినరయి విజయన్‌ వంటి నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడుతున్నది. ఏమైనా జాతీయంగా, ప్రాంతీయ స్థాయిలో ఏదైనా జరగొచ్చనే అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. కీలకమైన నియోజకవర్గ పునర్విభజన ఎజెండాను మరోసారి ముందుకు తెస్తున్న మోడీ సర్కారు దేశ రాజకీయ చిత్రపటాన్నేగాక రాజ్యాంగ లక్షణాలను కూడా మార్చేసే ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. 'వందేమాతరం' పూర్తిగా పాడాలని ఆదేశాలు ఇచ్చినట్టే గవర్నమెంట్‌ ఆఫ్‌ భారత్‌ అంటూ ఇప్పడు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తున్నది. జనాభా కమిషన్‌ పేరిట మతాలవారీగా దాడి తీవ్రం చేస్తున్నది. కనుక ఈ పుష్కర ప్రధాని సందడి వెనక ప్రమాదకరమైన వ్యూహాత్మక దాడులు పొంచి వుంటాయనేది నిస్సందేహం. వంత పాడే అవకాశవాదులను కూడా అవి వదలిపెట్టకపోవచ్చు.

  • తెలకపల్లి రవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్