ఎట్టకేలకు శాంతి ఒప్పందానికి అమెరికా, ఇరాన్ అంగీకరించడం హర్షణీయం. ఇజ్రాయిల్‌తో కలిసి ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించి, ప్రపంచాన్ని ఆర్థిక, ఇంధన, మానవతా సంక్షోభంలోకి నెట్టేసిన పాపం అమెరికాదే. తాజా ప్రకటన ప్రకారం లెబనాన్‌పై దాడులు సహా ఇజ్రాయిల్, అమెరికా అన్నింటినీ ఆపివేస్తాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది. అమెరికా నేవల్ బ్లాకేడ్‌ను విరమించుకుంటుంది. శుక్రవారం ఒప్పందంపై సంతకాల అనంతరం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తారు. స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్లలో సగం నిధులు విడుదలవుతాయి. 60 రోజులపాటు ఇరాన్ అణు కార్యక్రమం, యుద్ధంలో ధ్వంసమైన ఆ దేశ పునర్నిర్మాణం తదితర అంశాలపై చర్చలు సాగుతాయి. ఈ చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేతపై తుది ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరిస్తుండగా, సమయం మరింత పెరగవచ్చునని ఇరాన్ చెబుతోంది. ఈ ఒప్పందం అమెరికా, ఇరాన్ సహా పశ్చిమాసియా దేశాలకు, హర్మూజ్ జలసంధి దగ్గర దిక్కుతోచని స్థితిలో ఉన్న 800 నౌకలు, 20 వేల మంది సిబ్బందికి ఉపశమనమే. శాంతి ఒప్పందం ఎంతవరకూ అమలులోకి వస్తుంది, అగ్రిమెంట్ కుదురుతుందా అనే ప్రశ్నలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా విరామం తీసుకుని సోషలిస్టు క్యూబాపై మరిన్ని దురాగతాలకు పాల్పడవచ్చునన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ని ఆంక్షల నడుమ ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అరుణ పతాకాన్ని సమున్నతంగా నిలుపుతున్న క్యూబన్లు అమెరికా దురహంకారాన్ని తిప్పికొట్టి తీరుతారు.
ఆధునిక యుద్ధంలో ఎంత బలమైన దేశమైనా… బలహీనమైన దేశంపై కూడా సంపూర్ణమైన, నిర్ణయాత్మకమైన విజయం సాధించలేదని 107 రోజులపాటు సాగిన ఈ మారణహోమం మరోసారి నిరూపించింది. క్షిపణి దాడుల్లో చిన్నారులుసహా దాదాపు నాలుగు వేల మంది ఇరాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో గాంధీ పేరిట ఉన్న ఆసుప్రతి సహా 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు, 20 పాఠశాలలు సహా పురావస్తు సంపద, మ్యూజియాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ పై ఏకపక్ష దాడుల సందర్భంగా ట్రంప్ ప్రకటించిన ఏ లక్ష్యమూ నెరవేరకపోయినా, శాంతి ఒప్పందానికి అమెరికా తహతహలాడటానికి ఆ దేశ యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లకు చేరడమే కారణమని హార్వర్డ్ ఆర్థికవేత్తల అంచనా. చమురు ధరల పెరుగుదలతో మన దేశం సహా ప్రపంచమంతా ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతోంది. మూడున్నర కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడ్డారని ప్రపంచబ్యాంకు ఏప్రిల్ నెలాఖరున ప్రకటించింది.
అమెరికా దుర్మార్గపు దాడిలో వాణిజ్య నౌకలో ఉన్న విశాఖ వాసి సహా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మన దేశ నౌకలపై మూడుసార్లు దుర్మార్గపు దాడులకు పాల్పడి, ముగ్గురిని బలిగొన్న అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్షమాపణ చెప్పించాల్సి ఉండగా, విదేశాంగ మంత్రి సన్నాయి నొక్కులకే పరిమితం కావడం క్షంతవ్యం కాదు. కనీసం సంతాపం కూడా తెలపకుండా తలబిరుసుగా వ్యవహరించిన అమెరికా తీరును ఖండించలేకపోవడం భారత దేశ సార్వభౌమత్వానికి, ఆత్మగౌరవానికే అవమానం. బాధ్యులను శిక్షించేలా ఒత్తిడి చేసి, బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రానిది. తాజా ఒప్పందం ఖరారులో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తే, గ్లోబల్ సౌత్ లో అతి పెద్ద, నాయకత్వం వహించాల్సిన భారత దేశానికి ఎటువంటి పాత్ర లేకపోవడం మోడీ సర్కారు దౌత్య వైఫల్యమే. ఇకనైనా అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాలి. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చి, తమ దేశంతోపాటు ప్రపంచాన్ని అదే ఊబిలోకి నెట్టిన ట్రంప్‌ను చరిత్ర క్షమించదు. తొలి రోజే కీలక నేతలంతా మరణించినా మొక్కవోని ధైర్యంతో పోరాడి ఇరాన్ ఆత్మస్థయిర్యంతో నిలవడం గమనార్హం. ఆధునిక ప్రపంచంలో చర్చలు, దౌత్య కార్యక్రమాల ద్వారానే ఫలితాలు సాధించగలమని, బల ప్రయోగం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదని తాజా పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి.








కామెంట్లు (0)