శతాబ్దాల పాటు క్యూబా స్పానిష్ వలస రాజ్యంగా ఉంది. ఈ బానిసత్వ కాలంలో, అది వలస వాదానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. తన హక్కుల కోసం తీవ్రంగా శ్రమించి స్వాతంత్ర్యం పొందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా స్వేచ్ఛను మరోసారి హరించి, దానిని ఒక వలస దేశంగా మార్చి పాలించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. రెండోసారి పదవిని చేపట్టినప్పటి నుండి ట్రంప్ క్యూబా మీద ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయడం ఒక ఎత్తయితే, మే 20న క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై మోపిన అభియోగపత్రం క్యూబాను ఆక్రమించాలనే దురుద్దేశాన్ని వెల్లడిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం అసలు లక్ష్యం సోషలిస్ట్ క్యూబాను నాశనం చేయడమే.
మూడు దశాబ్దాల క్రితం, అంటే 1996లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని రావుల్ కాస్ట్రో మీదా, క్యూబా మీదా దాడి చేయడానికి ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఇప్పుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. 1996 ఫిబ్రవరి 24న, క్యూబా గగనతల పరిధిలోకి అక్రమంగా ప్రవేశించిన రెండు చిన్న విమానాలను క్యూబా వైమానిక దళం కూల్చివేసింది. వైమానిక నియమాలలో మొదటి నియమం ఏమిటంటే, అనుమతి లేకుండా ఏ పైలట్ కూడా మరొక దేశపు గగనతల పరిధిని దాటకూడదు. విలియం ఎమ్. లియో గ్రాండే, పీటర్ కోర్న్‌బ్లూ సంయుక్తంగా రచించిన 'బ్యాక్ ఛానల్ టు క్యూబా: ది హిడెన్ హిస్టరీ ఆఫ్ నెగోషియేషన్స్ బిట్వీన్ వాషింగ్టన్ అండ్ హవానా' అనే పుస్తకంలో వివరించినట్లుగా, ఒక సంవత్సరం పాటు నిరంతరాయంగా అంతర్జాతీయ గగనతల పరిధిని ఉల్లంఘిస్తున్న అమెరికన్ వైమానిక దళం క్యూబన్ల బృందం పదేపదే చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేసింది. అంతర్జాతీయ వైమానిక నిబంధనలను ఇలాగే ఉల్లంఘిస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని క్యూబా స్పష్టం చేసింది.
1959లో క్యూబా విప్లవం విజయవంతమైన తర్వాత, అత్యధిక శాతం ప్రజలు విప్లవాన్ని స్వాగతించగా, ఆస్తిపాస్తులు ఉన్న తరగతులకు చెందిన ఒక చిన్న మైనారిటీ వర్గం మాత్రం భిన్నమైన వైఖరిని తీసుకుంది. సైనిక నియంత బాటిస్టా నేతృత్వంలోని అమెరికన్ తోలుబొమ్మ ప్రభుత్వ మద్దతుదారులైన ఒక చిన్న సమూహం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారు క్యూబా ద్వీపానికి ఆనుకుని వున్న యునైటెడ్ స్టేట్స్‌లోని మయామి, ఫ్లోరిడా, పరిసర ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేసుకుని, క్యూబా విప్లవాన్ని కూలదోయడానికి తమ విప్లవ ప్రతీఘాత ప్రయత్నాలను కొనసాగించారు. విప్లవ నాయకుడు ఫైడెల్ కాస్ట్రోను నేరుగాను, మాఫియా ముఠాల ద్వారా పరోక్షంగాను హత్య చేయడానికి అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఎ 600 కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించిందని చూపే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రవాది జోస్ బాసుల్తో స్వయంగా ఇటువంటి ప్రణాళికల్లో పాల్గొన్నాడు. క్యూబా వైమానిక పరిధిలోకి నిరంతరాయంగా అక్రమంగా ప్రవేశించి దాడికి ప్రయత్నించిన ముఠాకు నేరుగా నాయకత్వం వహించాడు. ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నించాడు. అతనితో పాటు వచ్చిన రెండు చిన్న విమానాలు కూల్చివేయబడినప్పటికీ, బాసుల్తో విమానం ఎటువంటి ప్రమాదం లేకుండా తిరిగి వెళ్ళిపోయింది.
1996 విమానాల కూల్చివేత
ఈ ఉద్దేశపూర్వక చొరబాటుకు, ఆ తర్వాతి కాల్పులకు, నలుగురు క్యూబన్-అమెరికన్ పైలట్ల మరణానికి కారణం ఎవరు? ఫైడెల్ కాస్ట్రోను హత్య చేయడానికి నేరుగా జరిగిన దాడి సహా పలు క్యూబా వ్యతిరేక తిరుగుబాట్లలో నేరుగా పాలుపంచుకున్న జోస్ బాసుల్తో కాక ఇంకెవరు? సిఐఎ పథకం ప్రకారం 1961 నాటి 'బే ఆఫ్ పిగ్స్' తిరుగుబాటులో కూడా అతను భాగస్వామి. 1996 నాటి వివాదాస్పద సంఘటనలలో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
1996లో, అప్పటి అధ్యక్షుడు ఫైడెల్ కాస్ట్రో తమ దేశ సరిహద్దులను పదేపదే ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనేకమార్లు హెచ్చరించారు. ఈ విషయమై అమెరికా పరిపాలనా కేంద్రమైన వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్‌మెంట్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మధ్య చర్చలు నడిచినట్లు ఆధారాలు ఉన్నాయి. 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' అనే పేరుతో పనిచేస్తున్న బాసుల్తో క్యూబా వ్యతిరేక ముఠాను నియంత్రించకపోతే జరగబోయే పరిణామాలను ఒక ఈ-మెయిల్ ద్వారా పంచుకున్నారు. ఆ విమానాల కూల్చివేతకు ఒక నెల రోజుల ముందు వచ్చిన ఈ-మెయిల్ సందేశం ఇలా ఉంది: "అతి ఘోరమైన పరిస్థితి ఏమిటంటే, ఏదో ఒక రోజు క్యూబన్లు ఈ విమానాలలో ఒకదానిని కూల్చివేస్తారు, కాబట్టి ఎఫ్‌ఎఎ అన్ని విధాలా సిద్ధంగా ఉండటం మంచిది." అంతర్జాతీయ విమానయాన నిబంధనలను నిరంతరం ఉల్లంఘించడం వల్ల ఆ చిన్న విమానాల కూల్చివేతకు దారితీయవచ్చని అమెరికా అధికారులే చర్చించుకున్నారని దీనివల్ల స్పష్టమవుతోంది. పైన పేర్కొన్న ఈ-మెయిల్ సందేశమే దీనికి స్పష్టమైన నిదర్శనం. మరో మాటలో చెప్పాలంటే, సిఐఎ సహాయంతో తమ సార్వభౌమాధికారాన్ని పదేపదే సవాలు చేసిన రెండు చిన్న విమానాలను కూల్చివేయడం మినహా క్యూబాకు మరో గత్యంతరం లేని 30 ఏళ్ల క్రితం నాటి సంఘటనను అడ్డం పెట్టుకుని అమెరికా ఇప్పుడు రావుల్ కాస్ట్రోను దోషిగా చూపడానికి ప్రయత్నిస్తుంది.
ప్రస్తుతం 95 ఏళ్లు నిండిన (ఆయన పుట్టినరోజు జూన్ 3) జనరల్ రావుల్ కాస్ట్రో ఆనాడు క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ, తాను తలచినదే చట్టమని భావించే డొనాల్డ్ ట్రంప్, రావుల్ కాస్ట్రోను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఏకైక సోషలిస్ట్ దేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ ఏడాది జనవరి 3న, అమెరికన్ సైనికులు వెనిజులాలోకి అక్రమంగా ప్రవేశించి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య, పోరాట యోధురాలు సెలియా ఫ్లోరెస్‌ను అపహరించారు. అప్పటి నుండి వారు అమెరికాలో ఒక ప్రహసన ప్రాయమైన విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా ఒక అంతర్జాతీయ నేరపూరిత దేశంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఇంతకు మించిన తార్కాణం ఏముంటుంది? వెనిజులా నమూనాలోనే, క్యూబా విప్లవ నాయకుడు జనరల్ రావుల్ కాస్ట్రోను అపహరించుకుపోవడానికి, ఉగ్రవాద జోక్యానికి మార్గం సుగమం చేయడం కోసమే అమెరికా 1996 నాటి సంఘటనను ఇప్పుడు దుమ్ము దులిపి పైకి తీస్తున్నది.
1959లో విజయవంతమైన క్యూబా విప్లవం అమెరికా పాలకులకు మింగుడుపడడం లేదు. అప్పటి నుండి, ఆ దేశాన్ని వీలైనంత త్వరగా తిరిగి తమ ప్రభావం కిందికి తెచ్చుకోవడానికి, క్యూబాలో తిరుగుబాటును సృష్టించేందుకు వారు అనేక ప్రణాళికలు అమలు చేశారు. ఆరున్నర దశాబ్దాలకు పైగా ప్రయత్నించినప్పటికీ, అమెరికా పాలకులు విజయం సాధించలేకపోయారు. అందుకే అమెరికన్ సామ్రాజ్యవాద ప్రభుత్వం, 'యుద్ధోన్మాది' అయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, క్యూబాను దురాక్రమించి, స్వాధీనం చేసుకోవడానికి ఒక దుర్మార్గమైన, అతి హేయమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయడానికి నిశ్చయించుకున్నారు.
దురాక్రమణకు సన్నాహాలు
మే 20న రావుల్ కాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ మోపిన అభియోగ పత్రాన్ని...మదురో నమూనాలో ఆయనను కిడ్నాప్ చేసి ప్రహసన ప్రాయమైన విచారణకు గురిచెయ్యాలనే దండయాత్ర ప్రణాళిక బహిరంగ ప్రకటనకు ఆరంభంగా చూడాలి. అమెరికా అటార్నీ జేసన్ ఎ. రెడింగ్ క్విన్నోన్స్ , అసిస్టెంట్ అటార్నీలు అబ్బీ డి. వాక్స్మన్, మైఖేల్ ఇ. గిల్ఫార్బ్ సంతకాలు చేసిన ఆ అభియోగపత్రం దాదాపు ఒక తీర్పు లాగే ఉంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాశ్యప్ (కాష్) ప్రమోద్ పటేల్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో, ఈ పరిణామాలలో భారతీయ కోణం కూడా ఉంది. రావుల్ కాస్ట్రో , మరో ఐదుగురు క్యూబన్లపై మోపిన అభియోగపత్రం "ఎఫ్‌బిఐ ఎన్నటికీ మరచిపోలేదని, ఈ అభియోగపత్రం జవాబుదారీతనం వైపు ఒక పెద్ద అడుగు" అని చెప్పడానికి నిదర్శనమని పటేల్ అన్నారు.
రావుల్ కాస్ట్రోపై అభియోగపత్రం దాఖలు కావడానికి ఆరు రోజుల ముందు, మే 14న, యు.ఎస్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ సి-40బి క్లిప్పర్ జెట్ విమానం హవానాలోని ప్రసిద్ధ జోస్ మార్టి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతి జాన్ రాట్ క్లిఫ్ నేతృత్వంలోని అధికారుల బృందం క్యూబా ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. రావుల్ కాస్ట్రో మనవడు - రావుల్ గుల్లెర్మో రోడ్రిగ్జ్ కాస్ట్రో కూడా క్యూబా ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఆయన అమెరికా ప్రభుత్వ ముఖ్య అధికారులతో క్యూబా తరపున సమాంతర చర్చలు జరుపుతున్న బృందంలో కొంతకాలంగా భాగస్వామిగా ఉన్నారు.
వెనిజులా అధ్యక్షుడు మదురోను రక్షించడానికి నియమించబడిన 32 మంది క్యూబా భద్రతా సిబ్బందిని చంపి, ఆయనను, ఆయన భార్యను అపహరించిన విషయాన్ని గుర్తు చేస్తూ సిఐఎ అధిపతి క్యూబా ప్రతినిధి బృందాన్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. నిజానికి, వెనిజులా రాజధాని కారకాస్‌లో 32 మంది క్యూబా పౌరులను చంపినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను క్యూబాలోని క్రిమినల్ కోర్టులో విచారించాలి. హిరోషిమా, నాగసాకిలపై బాంబులు వేసినందుకు అమెరికన్ పాలకులకు ఎటువంటి శిక్ష పడలేదు (గుర్తుంచుకోండి, అది ఓడిపోయిన జపాన్‌లో జరిగింది). అటువంటి అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్, అణ్వాయుధాల నిల్వను కలిగి ఉండి, క్యూబా వైమానిక పరిధిని పదేపదే ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ చట్టం ప్రకారం రెండు చిన్న విమానాలను కూల్చివేయడం చాలా పెద్ద నేరమని చెబుతున్నాడు.
ముగింపు తదుపరి సంచికలో

వ్యాసకర్త : సి.పి.ఎం ప్రధాన కార్యదర్శి ఎం. ఎ. బేబీ








కామెంట్‌లు (0)