తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ కేంద్రంతో తమకు సిద్ధాంత విభేదాలున్నాయని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. తాము లౌకికవాదం, సామాజిక న్యాయం అనుసరిస్తామని ప్రకటించారు. సభలో తొలి సమగ్ర ప్రసంగం చేస్తూ విజయ్ తనది కేవలం సినిమా పార్టీ అంటే ఒప్పుకోనన్నారు. 'నేను దశాబ్దాలుగా నా అభిమాన సంఘాల ద్వారా ప్రజలతో పని చేస్తూ వచ్చాను. కార్యక్రమాలు చేశాను. అప్పుడు అనేక కష్టాలు కూడా ఎదుర్కొని నిలిచా'నని వ్యాఖ్యానించారు. తమ సభల తొక్కిసలాటతో ప్రజలు చనిపోవడం తాను మర్చిపోలేని బాధగా మిగిలిపోయిందని మరోసారి చెప్పారు. కేంద్రం ‘నీట్’ నిర్వహించడంతో తాము ఏకీభవించలేమని 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించాలని కోరారు. మదురై సమీపంలోని తిరుప్పుకుండ్రంలో పాత కాలపు స్తంభం దగ్గర దీపం వెలిగించే విధంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతామన్నారు. అయితే కేంద్రంతో సిద్ధాంత విభేదాలున్నా రాజ్యాంగ రీత్యా కలసి పని చేస్తామనీ, ప్రజా ప్రయోజనాలు సాధించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంలోనే డిఎంకె ప్రభుత్వంలో టాస్మాక్ అనే రాష్ట్ర వాణిజ్య సంస్థ నిధుల గురించి వాదోపవాదాలు జరిగాయి. అయితే మీడియా మాత్రం వీటితో సమానంగా విజయ్, త్రిష స్నేహం గురించిన కథలకు ఎక్కువ చోటు కేటాయించింది. విజయ్ పుట్టిన రోజునే ఆమె ఆయనను అన్‌ఫాలో చేశారనీ, శుభాకాంక్షలు చెప్పలేదనీ వార్తలు, స్క్రీన్ షాట్‌లు ఇచ్చింది. వీటిని కాస్సేపు సాగనిచ్చిన త్రిష తర్వాత శుభాకాంక్షలు చెప్పడమే గాక తాము కేక్ కట్ చేస్తున్న ఫొటో జత చేశారు. అసలు విషయాలను వదిలేసి పైపై కబుర్లతో కాలక్షేపం చేయడం మన మీడియాకు ఎంతిష్టమో!
అయ్యో దీదీ.. ఆఖరికేదీ?
మూడుసార్లు ముఖ్యమంత్రి, నచ్చని వారిని నలిపేసే నాయకురాలుగా పేరొందిన కరోడా...అగ్గి బరాటా..ఒకటేమిటి మమతా బెనర్జీ అనబడే దీదీకి లేని బిరుదులేమీ లేవు. కథ అడ్డం తిరిగిందంటే వీధుల్లో పడిపోతారు, ర్యాలీలతో రచ్చ చేస్తారు. ముఖ్యమంత్రిగానూ అదే తంతు. ఆఖరుకు ఇ.డి తనిఖీలను కూడా అడ్డుకున్నారు. కుంభకోణాలను కప్పిపెట్టేందుకు గొడవలు పెట్టుకున్నారు. ఎన్ని చేస్తేనేం అటు ఆమె అరాచకాలు, ఆ పైన బిజెపి మాయోపాయాలు కలిసి ఓడిపోయారు. ఓకె. కానీ మరు రోజునే మొత్తం వంధిమాగధుల్లా నటించిన అనుయాయులందరూ అమాంతం పార్టీ మార్చేయడమేమిటి? ఏకంగా అరవై మంది ఎమ్మెల్యేలు పోటీగా విడిపోయి మరో నేతను ప్రతిపక్ష నాయకుడుగా చేసుకోవడమేమిటి? ఆ పైన ఢిల్లీలోనూ ఇరవై మంది టి.ఎం.సి ఎంపీలు ఎన్.సి.పి.ఐ లో చేరడమేమిటి? మమత ఎంత ఆక్రోశించి వుంటారో? ఈ సమయంలోనూ ఆమె నిరసన ప్రదర్శన పెట్టారుగానీ పార్టీ వారు వస్తేనా? పైగా మరో అడుగు ముందుకేసి ఆమెను అధ్యక్ష పదవి నుంచి కూడా పీకేశాం పో అన్నారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను వ్యవస్థాపక అధ్యక్షురాలుగా స్థాపించిన దీదీని సోది లోకి లేకుండా తీసేశాం పో అనేశారు. అవకాశవాద పార్టీలలో తమ తమ నెలవులు తప్పిన అంతే మరి. కానీ ఇంకా మిగిలిన ఒకరు అర ఆమె వీరభక్తులు మాత్రం అదెలా కుదురుతుంది, ఆమె లేకపోతే పార్టీనే వుండదని వాపోతున్నారట. అయినా అక్కడ జరిగిపోతుంటే వీరి వేదన వినేదెవరు?
వాన్స్ వారి బెస్ట్ ఛాయిస్
హౌడీ మోడీ అంటే నమస్తే ట్రంప్ అంటూ స్నేహ గీతాలు పాడుకునే నమో మహాశయునికి అమెరికా అధినేతలు బాగానే బుద్ధి చెప్పారు. ఒకటికి రెండు సార్లు ఇరాన్ పై దురాక్రమణ, హర్మూజ్ దిగ్బంధం తర్వాత బాగా నష్టపోయింది మనమే కదా. అయినా సరే మోడీజీ పల్లెత్తు మాట అనకుండా ట్రంప్‌తో ఫోటోలు దిగుతూ నవ్వులు చిందిస్తూనే వస్తున్నారు. ఈ మధ్యనే జి7 సమావేశాల సందర్భంలో ట్రంప్ తాను మోడీ కోసం ఏదైనా చేస్తానని, ఆయన వున్నంత వరకూ ఇండియా పైకి ఎవరు వచ్చినా అడ్డుకుంటానని చెప్పేశారు. టారిఫ్‌ల వేటుతో, ఆంక్షలతో ముప్పుతిప్పలు పెట్టింది తానే కదా మరెవరినో అడ్డుకోవడమేమిటి, జోకుల సోకులు కాకుంటే? పైగా మోడీ వున్నంత వరకూ కాపాడతానంటే దేశంకన్నా వ్యక్తి ముఖ్యమంటున్నాడా ట్రంపాసురుడు? ఇక ఆయన ఉపాధ్యక్షుడైన జె.డి. వాన్స్ కథ మరోలా వుంది. ఆయన పాకిస్తాన్‌ను పొగిడి పరవశిస్తున్నారు. మీకు ఇష్టమైన ఇద్దరు ఇండియా, పాకిస్తాన్ ప్రముఖులను చెప్పమని అడిగితే తన భార్య ఉష, పాకిస్తాన్ సైనికాధికారి అసీమ్ మునీర్‌ల పేర్లు చెప్పేశాడు తడుముకోకుండా. తన అధ్యక్షుడు మోడీతో స్నేహం అంటే ఈ ఉపాధ్యక్షుడు మనీర్ ఫేవరేట్ అంటారు. అదే అమెరికా కుటిల నీతి. ద్వంద్వనీతి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ తామే ఆపామని గొప్పలు చెప్పుకోవడం గుర్తుంది కదా. ఏమైతేనేం మన నేత మాత్రం కాదనలేరు కదా. ట్రంప్ మాటే వేదం అంటారు. కొసమెరుపు ఏమంటే ఇండియాపై టారిఫ్‌లు పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం కొత్త చిట్కా కనిపెట్టిందట. చూడాలి మరి. చైనాను, ఇండియాను దూరం చేయాలన్నదే దాని పథకం. కానీ ఈ రెండు దేశాలూ ఈ మధ్యనే సంబంధాల సాధారణీకరణపై అవగాహనకు వచ్చాయి.
ఐటమ్ కాదు, పార్టీ సాంగ్స్...
వాటిని ఒకప్పుడు క్లబ్ డాన్స్‌లనేవారు. తర్వాత ఐటమ్ సాంగ్స్ అని సొగసైన పేరు పెట్టారు. ప్రముఖ నర్తకీమణులూ నాయికలు చేసే డాన్సులను ఐటమ్ అంటూ తీసిపారేయడం మహిళల పట్ల చిన్నచూపును తెల్పుతుంది. కానీ మేజువాణీలు, భోగం మేళాల నుంచి ఇప్పటి వరకూ ఈ లక్షణం వుండనే వుంది కదా. పురుషాధిక్య సమాజంలో వాటిని నిర్వహించేవారు రసికులు. ఆడేవారు ఐటమ్‌లన్నమాట. అందుకే హీరోయిన్ తమన్నా అవి ఐటమ్ సాంగ్స్ కాదు, పార్టీ సాంగ్స్ అని సవరిస్తున్నారు. వాటి కోసం కూడా చాలా కష్టపడతాం, రక్తి కట్టిస్తాం, ప్రియతమ నటీమణులే వాటిలో పాల్గొంటారు. చూడండి 'మై నేమ్ ఈజ్ షీలా' వంటి పాటలు కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి వారు చేసినవి సినిమాలను మించి హిట్టవలేదూ? సినిమాలు చీదేసినా ఈ పాటలు గుర్తుపెట్టుకున్నారే? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తను కూడా స్వతహాగా డాన్సర్ కాకున్నా వీటికోసం చాలా శ్రద్ధ తీసుకుంటారట. ఇంతకన్నా ముఖ్యమైన మరో పాయింట్ చెప్పారామె. ముంబాయిలో బాలీవుడ్ నటీమణులకు స్వేచ్ఛనిస్తుందట. వారు గనక తమదైన, మెరుగైన పద్ధతుల్లో చేస్తామంటే ట్రై చేయనిస్తుందట. కానీ దక్షిణాది సంగతి వేరు. ఇక్కడంతా పురుషాధిక్యతే. ఏదో విధంగా ఈ డాన్సుల్లో గ్లామర్ గుప్పించి వదలిపెట్టాలి. వారు చెప్పినట్టు శృంగారం గుమ్మరించాలి. అంతే, ఇక్కడ హీరోలు గ్లామర్ కోసం నాయికలపైనే ఆధారపడుతుంటారు. కనకనే ఈ సమస్య అన్నారు. అయితే తన డాన్స్ నెంబర్స్ తనకు మంచి పేరే తెచ్చాయని ఒప్పుకున్నారు.
- పీపీ








కామెంట్‌లు (0)