ఎపిఎల్ ట్రోఫీ ఆవిష్కరణలో హీరో రామ్ చరణ్
ప్రజాశక్తి - అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ (ఎపిఎల్) ట్రోపీని, ఆయా జట్ల కొత్త జెర్సీలను ప్రముఖ సినీ కథానాయకులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ఆవిష్కరించారు. ఇక్కడి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగానూ విచ్చేయగా.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎసిఎ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాజ్యసభ సభ్యులు, ఎసిఎ కార్యదర్శి సానా సతీశ్, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎపిఎల్ అద్భుతమైన వేదికని కొనియాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దాగి ఉన్న సరికొత్త క్రికెట్ టాలెంట్‌ను వెలికితీయడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పోటీ పడుతున్న ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రామ్ చరణ్ రాకతో స్టేడియం మొత్తం అభిమానుల కోలాహలంతో ఉర్రూతలూగింది. ఈ ప్రత్యేక ఈవెంట్ ముగిసిన వెంటనే ‘భీమవరం బుల్స్’, ‘క్యాపిటల్ అమరావతి రాయల్స్’ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో గ్రూప్ దశ (లీగ్) మ్యాచ్‌లు జూన్ 27వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత నాకౌట్/ప్లేఆఫ్స్ పోరు మొదలై.. జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగుస్తుం ది. ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఆడిన 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లు సాధించిన భీమవరం బుల్స్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్ రేసులో బలంగా దూసుకుపోతోంది.








కామెంట్‌లు (0)