గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌లో 54.4 లక్షల అకౌంట్లు, పోస్టులను తొలగించిన మెటా..

21 నిమిషాల క్రితం

భారత్‌లో 54.4 లక్షల అకౌంట్లు, పోస్టులను తొలగించిన మెటా..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 03:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* అధికంగా ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు


బెంగళూరు:

దేశంలో ఈ ఏడాదిలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన 'మెటా' 54.4 లక్షల పోస్టులు, అకౌంట్లను తొలగించింది. ఇవి కేవలం ఈ ఏడాది మొదటి ఆరు నెలల గణాంకాలు మాత్రమే. గతేడాది చివరి ఆరు నెలలతో పోలిస్తే, కంటెంట్ తొలగింపు చర్యల్లో 131 శాతం పెరుగుదల నమోదైంది.


ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పబ్లిక్ పోస్టులను తొలగించే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ కంటే ముందు ఇండోనేషియా మాత్రమే ఉంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. అసంతృప్తితో ఉన్న యువతలో పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు విచారణలకు సంబంధించిన వార్తలను సైతం ప్రజల కంటపడకుండా తొలగించే ధోరణి కనిపిస్తోంది.


భారత ఐటీ నిబంధనల్లో ఫిబ్రవరిలో తీసుకొచ్చిన సవరణల తర్వాత పోస్టులను తొలగించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసే తొలగింపు ఆదేశాలపై ప్లాట్‌ఫారమ్‌లు మూడు గంటల్లోగా చర్యలు తీసుకోవాలని కొత్త చట్టం నిర్దేశిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన 'సహయోగ్' పోర్టల్ ద్వారా పోలీసులు నేరుగా నోటీసులు పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సామూహిక తొలగింపు చర్యలు మొదలయ్యాయి.


ఈ ఏడాది జులై వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఫేస్‌బుక్‌లో దాదాపు 28 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 26 లక్షల కంటెంట్లపై నియంత్రణ విధించారు. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ నియంత్రణలు తగ్గుతుండగా, భారత్‌లో మాత్రం పెరుగుతున్నాయి. 2025 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా 2.78 కోట్లుగా ఉన్న కంటెంట్ తొలగింపులు, 2026 ప్రథమార్థంలో 2.71 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. కానీ భారత్‌లో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది.


ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, వివిధ రాష్ట్రాల పోలీసు ఏజెన్సీల ఆదేశాలతో పాటు ఆటోమేటెడ్ (స్వయంచాలక) వ్యవస్థల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్లు మెటా స్పష్టం చేసింది.


'థ్రెడ్స్' ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారత్‌లో 20,000కు పైగా కంటెంట్‌లను మెటా తొలగించింది. 2022 ద్వితీయార్థంలో 1,090గా ఉన్న ఈ సంఖ్య, 2024 మరియు 2025లలో క్రమంగా పెరిగి 41,400కు చేరుకుంది.


కోర్టు మెట్లెక్కిన 'లైవ్ లా'


ఒకసారి నిషేధించిన కంటెంట్ తాలూకు నకళ్లను (Identical copies) స్వయంచాలకంగా గుర్తించి తొలగించే ఆటోమేటెడ్ వ్యవస్థలే ఈ స్థాయిలో నియంత్రణలు పెరగడానికి ప్రధాన కారణమని మెటా పేర్కొంది. రాజకీయ లక్ష్యాలతో కూడిన బ్లాకింగ్ చర్యలు ఇప్పుడు కోర్టు వివాదాలకు దారితీస్తున్నాయి.


సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించిన తమ రీల్స్‌ను ఎటువంటి ముందస్తు సమాచారం లేదా కారణం లేకుండా ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేటిక్‌గా తొలగించడాన్ని సవాలు చేస్తూ న్యాయ వార్తల పోర్టల్ 'లైవ్ లా' (Live Law) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఐటీ రూల్ 4(4) కింద జరుగుతున్న ఆటోమేటెడ్ కంటెంట్ బ్లాకింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌పై 2026 నవంబర్ 19న ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ 2027 జనవరి 18న జరగనుంది.


అయితే మీడియా సంస్థలపై బ్లాకింగ్ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కంటెంట్‌ను ఏ కారణంతో తొలగించారో స్పష్టం చేయకపోవడం, అప్పీల్ చేసుకునే వ్యవస్థల్లో తీవ్ర జాప్యం జరగడం డిజిటల్ భావ ప్రకటనా స్వేచ్ఛకు సవాలుగా మారుతున్నాయని డిజిటల్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించిన కీలక తీర్పుల వార్తలను సైతం అల్గారిథమ్ ద్వారా వేరు చేసి సామూహికంగా తొలగించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్