ఆర్‌పిఎంసి పరీక్ష రద్దు
రూ. 3.5 లక్షలకు డీల్... నలుగురు అరెస్ట్
జైపూర్ : బిజెపి పాలిత రాజస్తాన్‌లో మరో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. దేశవ్యాప్తంగా నీట్ యుజి పేపర్ లీకేజీ, మహారాష్ట్రలో టెట్ పరీక్షా పేపర్ లీక్ ఘటన మరువకముందే ఇప్పుడు రాజస్తాన్‌లో పారామెడికల్ పరీక్షకు సంబంధించిన ఆర్‌పిఎంసి ప్రశ్నాప్రతాల లీకేజీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో సోమవారం నిర్వహించిన పారామెడికల్ డిప్లొమా పరీక్షలో విద్యార్థులకు ఇన్విజిలేటర్ల సహాయంతో కాపీయింగ్ చేయించి పాస్ చేయించాలని ఓ ముఠా పక్కా ప్రణాళిక రచించింది. పోలీసులు పరీక్ష ప్రారంభానికి ముందే నిందితుల్ని పట్టుకొని వారి కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో పరీక్షా కేంద్రం కాలేజీ అడ్మినిస్ట్రేటర్, అతని మేనల్లుడు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ వ్యాప్తంగా సోమవారం పారామెడికల్ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. జైపూర్‌లోని ప్రభాదేవి మెమోరియల్ పిజి కాలేజీ కూడా పరీక్ష కేంద్రంగా ఉంది. ఈ కేంద్రంలో పెద్ద ఎత్తున కాపీయింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్టు జైపూర్ (వెస్ట్) పరిధిలోని ఖోరా బిసాల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే పరీక్షా కేంద్రంపై దాడి చేసి భారీ మోసాన్ని అడ్డుకున్నారు. ఈ కేసులో ప్రభాదేవి మెమోరియల్ పీజీ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ రామ్‌కృష్ణ మండివాల్, అతని మేనల్లుడు దేవ్‌కృష్ణ, ఝున్‌ఝునూ జిల్లాలోని ఎస్. కరణ్ కాలేజీలో పని చేస్తున్న కృష్ణ కుమార్ సైనీ, శంకర్ లాల్ జాట్‌లను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ కుమార్, శంకర్ లాల్ పరీక్షా కేంద్రంలోనే ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించాల్సి ఉండటంతో వారి పాత్రపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కళాశాలల మధ్య ముందే ఒప్పందం
ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఝున్‌ఝునూలోని ఎస్. కరణ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గతంలో పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈసారి ఎలాగైనా వారిని పాస్ చేయించాలనే ఉద్దేశంతో కళాశాల సిబ్బంది కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం పరీక్షా కేంద్రంగా ఉన్న ప్రభాదేవి మెమోరియల్ పీజీ కాలేజీ నిర్వాహకులతోనే కుమ్మక్కయ్యారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్ల సహాయంతోనే విద్యార్థులకు కాపీయింగ్ చేసే అవకాశం కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించి రెండు కళాశాలల మధ్య ముందుగానే ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో తేలింది.
విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు
ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో సుమారు రూ.3.50 లక్షలు సేకరించినట్లు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రఫ్ స్లిప్స్‌లో కాపీయింగ్ ద్వారా లబ్ది పొందాల్సిన విద్యార్థుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. పోలీసులు సకాలంలో రైడ్స్ చేయడంతో ప్రణాళిక అమలు కాకముందే భగ్నమైంది. ఘటనపై ఖోరా బిసాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థకు కూడా సమాచారం అందించారు.









కామెంట్‌లు (0)