దేశవ్యాప్తంగా 100 నిరసన ర్యాలీలు : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ అవకతవకలకు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగించాలని కోరుతూ చేస్తున్న ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా 100 నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ‘విద్యార్థుల ప్రాణాలు అమూల్యమైనవి; ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’ అనే నినాదంతో ఈ ర్యాలీలను నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజి, ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య ఒక ప్రకటనలో తెలిపారు. జులై 3న కేరళలోని 14 జిల్లా కేంద్రాల్లో మార్చ్‌లు నిర్వహిస్తామన్నారు. అవకతవకల కారణంగా నీట్ పరీక్షను రద్దు చేయడంతో ఒత్తిడికి గురై 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్వాకాన్ని, ప్రశ్నాపత్రాల లీక్ మాఫియాను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఇప్పటికే అనేక నిరసనలు చేపట్టింది. మే 3న విద్యా మంత్రిత్వ శాఖ వరకు జరిగిన మార్చ్‌పై పోలీసులు దారుణంగా దాడి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సంతకాల సేకరణ నిర్వహించారు. 22 రాష్ట్రాల్లోని 643 కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో 823 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో 16 మంది జైలులో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలను కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది.









కామెంట్‌లు (0)