ఖనిజాలకు విలువ జోడింపు
మినరల్ వెల్త్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై అధ్యయనం
సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో గనులశాఖపై సిఎం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఎమ్‌డిసి ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యూమినియం వంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని వ్యాఖ్యానించారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్‌కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. ఎపి, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై క్లస్టర్ ఏర్పాటుచేయాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా వాటిపై కూడా అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచించారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సిసి కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించటంతో పాటు వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సిఎస్ సాయి ప్రసాద్, గనులశాఖ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, పీయుష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)