ఖతార్ స్పష్టీకరణ
దోహా: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఖతార్‌కు చేరుకున్నాయి. నేరుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగవని ఖతార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్‌నర్ మధ్యవర్తులతో భేటీ కానున్నారు. పర్షియన్ గల్ఫ్‌లో ఇరు వైపులా దాడులు జరగడంతో చర్చలకు ప్రతిష్టంభన ఏర్పడింది. నాలుగు రోజుల పాటు క్షిపణి దాడులు, ప్రతిదాడుల అనంతరం ఇరు దేశాలు దాడులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇరాన్ తమతో సమావేశానికి అభ్యర్థించిందని, దోహాలో ఇరు పక్షాలు సమావేశం కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ ప్రకటనను ఖండించింది. ఈ చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్‌కు తమ ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నామని, మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు మాత్రమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల చర్చలపై ఆందోళన వద్దని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి అన్నారు. అమెరికాతో ఏ స్థాయిలోనూ కలవబోమని తేల్పి చెప్పారు. హర్మూజ్ జలసంధిలో మైన్లను తొలగించేందకు విదేశీ సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఇరు దేశాలు శాంతి చర్చలు వేగవంతం చేయాలన్నారు. సంప్రదింపుల ద్వారా ఘర్షణలు నివారించి, శాశ్వత శాంతి నెలకొల్పాలని ఆయన కోరారు.








కామెంట్‌లు (0)