mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి వైరస్‌కు మేమే యాంటీ-వైరస్‌

3 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నితిన్‌ ‌నబిన్‌ ‌వ్యాఖ్యలపై అభిజిత్‌ దీప్కే ఆగ్రహం

  • 2015 నుండి 150కి పైగా పేపర్ లీక్‌లు

  • లీక్ మాఫియా స్వేచ్ఛగా తిరుగుతుంటే విద్యార్థి, రైతు నేత‌ల గృహ నిర్బంధాలెందుకు?

  • ప్రశ్నించిన సిజెపి నేతలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాక్రోచ్‌ ‌జనతా పార్టీని వైర‌స్‌తో పోల్చిన‌ బిజెపి జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ వ్యాఖ్యలపై సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ ‌దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. "మన విద్యా వ్యవస్థను కుళ్లిపోయేలా చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, బిజెపి అనే వైరస్‌కు మేమే యాంటీ-వైరస్" అని ఆయన అన్నారు. నీట్ పేపర్ లీక్‌, సిబిఎస్ఇ అవ‌క‌త‌వ‌క‌లు వంటి విద్యా వైఫ‌ల్యాల‌కు జవాబుదారీతనం వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజెపి ఆధ్వర్యాన జంతర్‌ ‌మంతర్‌‌లో కొనసాగుతున్న విద్యార్థి-యువజన ఉద్య‌మం 11 రోజు మంగ‌ళ‌వారం కొన‌సాగింది. పర్యావర‌ణ కార్య‌క‌ర్త‌, విద్యా వేత్త‌ సోనమ్ వాంగ్‌చుక్ నిర‌వ‌ధిక నిరాహార దీక్ష మూడో రోజు కొన‌సాగింది. వాంగ్‌చుక్‌కు డాక్టర్ నితిన్ దిఘే ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రక్తపోటు (బిపి) 117/60, ఆక్సిజన్ స్థాయి 96, నాడి వేగం (ప‌ల్స్ రేట్‌) 92, చక్కెర స్థాయి 66కు ప‌డిపోయాయ‌ని ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న వేడిని దృష్టిలో ఉంచుకుని, ఆయనకు అదనపు జాగ్రత్తలు అవసరమని డాక్టర్ దిఘే తెలిపారు.

దీక్షనుద్ధేశించి అభిజీత్ దీప్కే మాట్లాడుతూ మొదటి రోజు నుంచే బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. "ఢిల్లీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోరు. కానీ మా వాలంటీర్ల ఇళ్లకు వెళ్లి వారిని బెదిరిస్తున్నారు. ఈ నిరసనను అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు బిజెపితో కలిసి పనిచేస్తున్నారనడానికి ఇదే స్పష్టమైన రుజువు" అని దీప్కే అన్నారు. బిజెపి 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వాలైన మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన పేపర్ లీక్‌లను దీప్కే ప్రస్తావించారు. "ప్రధాని పేపర్ లీక్‌లను పట్టించుకోవడం లేదు. ఆయన ప్రపంచ పర్యటనలు, ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడం, పాటలు పాడటం వంటి మరింత ముఖ్యమైన విషయాలలో నిమగ్నమై ఉన్నారు" అని ఎద్దేవా చేశారు. రోజురోజుకూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నందున‌, ప్ర‌భుత్వం ఏమి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూస్తున్నామ‌ని అన్నారు. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌రువాత‌, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణను నిర్ణ‌యిస్తామ‌ని తెలిపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి

ఈ ఉద్యమం ఇకపై కేవలం నీట్‌కు మాత్రమే పరిమితం కాదని, తల్లిదండ్రులు, యువత అందరూ ఉద్య‌మంలో పాల్గొనాలని సిజెపి జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ అశుతోష్ రాంకా విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో మంగళవారం పారామెడికల్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్‌ను ఆయన ఉదహరించారు. "2015 నుండి 150కి పైగా పరీక్షా పత్రాల లీకేజీలు జరిగాయి. గళం విప్పడానికి ఇదే సరైన సమయం. లేకపోతే రేపు మీ పరీక్షా పత్రం లేదా మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. ఎవరి పైనో ఉన్న భక్తి భావంతో నిరసనలో పాల్గొనకుండా మీ పిల్లలను అడ్డుకోవద్దు. అలా చేస్తే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసినట్లవుతుంది" అని అన్నారు. జంతర్ మంతర్ చేరుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థి, రైతు సంఘాల నేత‌ల‌ను గృహ నిర్బంధం చేయడంపై స్పందించిన సిజెపి ప్ర‌తినిధి దీప‌క్ బ‌లియాన్ మాట్లాడుతూ ఆందోళ‌నకు వ‌స్తున్న అనేక బృందాలను అడ్డుకుని నిర్బంధించారని అన్నారు. "పరీక్షా పత్రాల లీకేజీ మాఫియాపై ఇదే స్థాయి ఒత్తిడిని, కృషిని పెట్టి ఉంటే, ఈ లీకేజీలను నివారించగలిగేవారు" అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్