రూ. 6,910 కోట్ల నిధుల మళ్లింపు కేసులో సెటిల్‌మెంట్ కు సెబీ నో
ముంబయి : సెటిల్‌మెంట్ చేసుకుందామంటూ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ చేసిన విజ్ఞప్తిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ సంస్థలకు చెందిన సుమారు 700 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6,910 కోట్లు) నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీ, ఆయన గ్రూప్ దాఖలు చేసిన సెటిల్‌మెంట్ దరఖాస్తులను సెబీ తాజాగా తిరస్కరించింది. ఈ పరిణామం అంబానీ గ్రూపునకు భారీ ఆందోళన కలిగిస్తోంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి రూ.6526 కోట్ల నిధులను అంబానీకి సన్నిహితంగా ఉండే సంస్థలకు అక్రమంగా మళ్లించారనేది సెబీ ప్రధాన ఆరోపణ. ఈ నిధులు కార్పొరేట్ అవసరాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడారని సెబీ అనుమానిస్తోంది. మరోవైపు సిఎల్‌ఇ ప్రయివేటు లిమిటెడ్ అనే ఇంజనీరింగ్ సంస్థకు రూ.17,670 కోట్ల భారీ మొత్తాన్ని మళ్లించారని.. ఆ నిధులు తిరిగి అంబానీ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులుగా చేరాయని సెబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి సిఎల్‌ఇ స్వతంత్ర సంస్థ కాదని, అది అంబానీ నియంత్రణలోనే పనిచేస్తోందని సెబీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను అంబానీ గ్రూప్ ప్రతినిధులు పూర్తిగా ఖండించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ నిపుణుల సలహాతో చట్టబద్ధంగా పోరాడుతామని పేర్కొన్నారు. గత ఏడాది యెస్ బ్యాంక్ కేసులో కూడా సెటిల్‌మెంట్ అభ్యర్థన తిరస్కరణకు గురికావడం గమనార్హం. ప్రస్తుతం సెటిల్‌మెంట్ కుదరకపోవడంతో.. సెబీ ఈ ఉల్లంఘనలపై త్వరలోనే పూర్తిస్థాయి పబ్లిక్ ఆర్డర్‌ను జారీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల జరిమానాలతో పాటు క్యాపిటల్ మార్కెట్‌లలో ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ త్వరలో రూ.3000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం కంపెనీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన 18 నెలలుగా అనిల్ అంబానీ గ్రూపుపై దర్యాప్తు సంస్థల నిఘా కొనసాగుతుండటం గమనార్హం.









కామెంట్‌లు (0)