లక్నో : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ని పోలీసులు మంగళవారం నిర్బంధించారు. కాంగ్రెస్ హైకమాండ్ నేడు అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలని నిర్ణయించింది. అయితే తాను అయోధ్యలోని ఆచార్య నరేంద్ర దేవ యూనివర్శిటీ అతిథి గృహంలో గృహ నిర్బంధంలో ఉన్నానని అజయ్‌రాయ్ మీడియాకు తెలిపారు. "అయోధ్య అవినీతి కేసులో తమ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు యోగి ప్రభుత్వం యత్నిస్తోంది. విరాళాల అవినీతి వెనుక ఉన్న అసలు వ్యక్తులను వారు అరెస్టు చేయలేదు. మేము చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ,ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అయోధ్యను సందర్శించాల్సిన మా నలుగురు ఎంపీలు కూడా వేర్వేరు ప్రదేశాలలో గృహ నిర్బంధంలో ఉన్నారు’’ అని అన్నారు. ప్రభుత్వం నియంత్రించినప్పటికీ తాము అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తామని అన్నారు.
పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అజయ్ రాయ్ నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం పర్యటించనుందని కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బృందంలో కిషోరి లాల్ శర్మ (అమేథీ), రాకేష్ రాథోర్ (సీతాపూర్), ఉజ్వల్ రమణ్ సింగ్ (ప్రయాగ్‌రాజ్), తనుజ్ పునియా (బారాబంకీ) ఎంపిలు ఉన్నారు. వీరితో పాటు బారాబంకీ మాజీ ఎంపి ఎస్.పి. గౌతమ్, మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్, మహారాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే వీరేంద్ర చౌదరి, బారాబంకీ మాజీ ఎమ్మెల్యే మితా గౌతమ్ కూడా ఉన్నారని ప్రకటన తెలిపింది. పర్యటనకు సంబంధించి పార్టీ స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించింది. అయినప్పటికీ వారిని నిర్బంధించిందని తెలిపింది.









కామెంట్‌లు (0)