mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తీవ్ర ఎండల ఎఫెక్ట్ - పెరిగిన కోడిగుడ్ల ధరలు ..!

21 గంటల క్రితం

Impact of intense heat – Egg prices rise..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 02:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా లేయర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో కోడిగుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ఉత్పత్తి వ్యయాన్ని అధికం చేసింది. ఈ రెండు కారణాల ప్రభావంతో మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పది రోజుల క్రితం రూ.180 ఉన్న 30 గుడ్ల ట్రే ధర ప్రస్తుతం రూ.200కు చేరుకుంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.60 ఉండగా, రిటైల్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు.


ఎండలతో తగ్గిన గుడ్ల ఉత్పత్తి

ఈ ఏడాది నమోదైన తీవ్ర ఎండల కారణంగా అనేక కోళ్ల ఫారాల్లో లేయర్‌ కోళ్లు చనిపోవడంతో గుడ్ల ఉత్పత్తి దెబ్బతింది. సాధారణంగా 95 శాతం వరకు ఉండే ఉత్పత్తి ప్రస్తుతం 65 శాతానికి పడిపోయినట్లు ఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కలిపి సుమారు కోటి సామర్థ్యం గల లేయర్‌ కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో కరీంనగర్‌–హైదరాబాద్‌ మార్గంలోనే 30 నుంచి 40 లక్షల సామర్థ్యం గల ఫారాలు కొనసాగుతున్నాయి.


రోజుకు 70 లక్షల గుడ్ల ఎగుమతి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రతిరోజూ సుమారు 70 లక్షల కోడిగుడ్లు అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగ్‌పూర్, కోల్‌కత తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా కూడా కోడిగుడ్ల వినియోగం అధికంగానే ఉంది. ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా రోజుకు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్