మృతురాలి తల్లిదండ్రులకు మంత్రి వంగలపూడి అనిత హామీ
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రాధా గాయత్రి తల్లిదండ్రులు పి.సుధాకర్, పి.సత్యవతి హోంమంత్రిని కలిసి తమ కుమార్తె మృతి కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై స్పందించిన హోంమంత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సూరీ పోలీసు అధికారులతో సమర్థవంతమైన సమన్వయం కొనసాగించాలని సౌత్ జోన్ డిసిపి మేరీ ప్రశాంతి, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చికి ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ప్రక్రియలను వేగవంతం చేయడానికి అధికారిక లేఖ పంపనున్నట్లు తెలిపారు. ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయ సహాయం అందించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని హోం మంత్రి వెల్లడించారు.









కామెంట్‌లు (0)