డేటా సెంటర్ కథనం -4
2057 నాటికి స్వల్ప నికర ప్రయోజనం!
6.5 గిగావాట్లకు కలిపి 1800 నుంచి 3000 మందికే ఉద్యోగావకాశాలు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ఉమ్మడి విశాఖలో రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లతో రాష్టానికిగానీ, విశాఖకుగానీ ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనం సున్నా అని వెల్లడవుతోంది. అయితే, ఇప్పటికే ఈ డేటా సెంటర్లకు ప్రజల వనరులైన భూమి, నీరు, విద్యుత్ వంటివి ఏళ్ల కాలానికి రాయితీలతో టిడిపి కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేసేసింది. 2057-2060 సంవత్సరాల నాటికి బ్రేక్ ఈవెన్ (నికరంగా) కొంత ప్రయోజనం ఉండబోతుందని తెలుస్తోంది. అంటే అప్పటివరకూ రాష్ట్రానికి ఆదాయం ఒక్కపైసా కూడా ఉండదు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ఈ డేటా సెంటర్లపై విడుదల చేసిన మూడు వీడియోల్లో ఎక్కడా కూడా ఎపి ప్రభుత్వం డేటా సెంటర్ల నుంచి ఏ ఆదాయం ఆశిస్తుందో? ఎప్పుడు అది వస్తుందో? చెప్పలేకపోయారు. అయినప్పటికీ వనరులన్నీ కార్పొరేట్లకు ఇప్పటికే కట్టబెట్టేశారు. ప్రభుత్వ నివేదికల్లో 2030 నాటికి తర్లువాడలో 308 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యంతోనూ, అడవివరం (ముడసర్లోవ)లో 512 మెగావాట్లు (0.5 గిగావాట్లు), అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వెయ్యి మెగావాట్లు (ఒక గిగావాట్) సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటవుతాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గూగుల్-అదానికి కట్టబెట్టింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. నాలుగో డేటా సెంటర్ భోగాపురంలో రిలయన్స్ ఆధ్వర్యంలో 1500 మెగావాట్లు (1.5 గిగావాట్) సామర్థ్యంతో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నాలుగే కాకుండా మరో రెండు డేటా సెంటర్ల (2.5 గిగావాట్లు) కోసం రాష్ర్ట ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. మొత్తం కలిపితే 6.5 గిగావాట్ల డేటా సెంటర్లను విశాఖ సమీప ప్రాంతాల్లో కేంద్రీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డేటా సెంటర్లను 2030 నాటికి అందుబాటులోకి తెచ్చి భారతదేశానికే విశాఖను డేటా సెంటర్ల రాజధాని చేస్తామంటూ చంద్రబాబు, లోకేష్, ఎంపీ శ్రీభరత్ ఊదరగొడుతున్నారు.
ఏం జరగబోతుంది?
డేటా సెంటర్లతో దాదాపు 2057 నాటికి ఆదాయం రావడం మొదలవుతుందని వీడియోలో ఎంపీ శ్రీ భరత్ చెబుతున్నారు. రాయితీలన్నీ ముగిసేసరికి 2030 నుంచి 27 ఏళ్లు దాటాక బ్రేక్ ఈవెన్ మొదలు కానుందని తెలుస్తోంది. ఇలా ఒక గిగావాట్‌కు `భవనాలపై ఆస్తి పన్ను రూ.50-100 కోట్లు డేటా సెంటర్ల నిర్మాణాలపై లభిస్తుందని అంచనా. ఆదాయపు పన్ను కూడా పెద్ద మొత్తంలో కేంద్రానికే వెళ్లిపోనుంది.
ఉద్యోగాలు స్వల్పం
వేలు, లక్షలు ఉద్యోగాలంటూ రాష్ర్టంలోని ‘కూటమి’ ప్రభుత్వం చెబుతున్నా ఒక గిగావాట్‌కు శాశ్వత ఉద్యోగాలు 300 నుంచి 500 వరకూ ఉంటాయి. పూర్తి 6.5 గిగావాట్ల డేటా సెంటర్లలో శాశ్వత ఉద్యోగాలు 1800-3000 వరకూ ఉండనున్నాయి. పరోక్ష ఉద్యోగాలెన్ని అన్నది ప్రభుత్వానికి అంచనా లేదు. డేటా సెంటర్లలో ఉద్యోగాలపై రాష్ర్ట హోంమంత్రి అనిత ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘ఇపుడు ఉద్యోగాలే ఉద్యోగాలు... మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. మా టైంలో అయితే మేం ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవాళ్లం’ అంటూ చెప్పడం హాస్యాస్పదమైంది. ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్‌ప్లాంట్ 17 వేల మందికిపైగా నేరుగా ఉపాధినిస్తోంది. సగటున ఒక మీడియం ఇండ్రస్టీ కూడా 2 నుంచి 5 వేల మందికి ఉపాధి ఇస్తుంది. కానీ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్లని, రూ.లక్షల కోట్ల పెట్టుబడులని చెబుతూ వందల ఎకరాలను స్వాధీనం చేసుకుని కనీసం ఐదు వేల ఉద్యోగాలను సైతం డేటా సెంటర్లలో కల్పించడం లేదు.








కామెంట్‌లు (0)