mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆశయ బాటలో జోయమ్మ...

2 గంటల క్రితం

Joyamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 06:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

సీనియర్‌ కమ్యూనిస్టు నాయకురాలు, వ్యవసాయ కార్మిక, రైతు ఉద్యమాల నేత యార్లగడ్డ జోయ (86) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. సాంప్రదాయ ధనిక రైతు కుటుంబంలో పుట్టి అభ్యుదయ భావాల వైపు సాగిన ఆమె ప్రయాణం ఆదర్శనీయం. ఒడుదుడుకులు ఎన్ని ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని, ఎంచుకున్న మార్గాన్ని వీడని ధీరవనిత ఆమె. మూఢనమ్మకాలను, ఆధిపత్య భావజాలాన్ని ఎదిరిస్తూ జీవితాంతం పోరాడిన ధీశాలి. మహిళా ఉద్యమానికి, మానవీయ విలువల పెంపొందింపునకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయాలు. జోయ నడిచిన దారి అభ్యుదయ తరాలకు మార్గదర్శకం. ఈ అమ్మ స్వాతంత్ర్యానంతర అభ్యుదయ తరానికి ప్రతినిధి. ఆదర్శాల నిధి.

కృష్ణాజిల్లా దివి తాలూకా చినకళ్లేపల్లిలో గుత్తికొండ కోదండరామయ్య, మాణిక్యమ్మ దంపతులకు జోయ 1940 అక్టోబరు 30న జన్మించారు. ఆమెకు ఏడేళ్లు వచ్చే వరకు పెద్దమ్మ, పెదనాన్నల వద్దే పెరిగారు. ఊహ తెలిసే వయసుకే ఆమె బంధువుల కుటుంబాల్లో రాజకీయ చర్చలు జరుగుతుండేవి. అప్పట్లో బాలల సంఘం సభ్యులతో కలిసి 'భరతమాత పుత్రులం' వంటి దేశభక్తి గీతాలు పాడేవారు. జోయ కూడా వాటిని విని ఆలపించేవారు. ఆమె పెద్దమ్మ సీతమ్మ దేశభక్తి గీతాలను నేర్పేవారు. 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఊరేగింపులో కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కలిసి ఆమె కూడా పాల్గొన్నారు.

ఆమె నాయనమ్మ పుట్టిల్లు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు. అక్కడ స్త్రీలకు నెలసరి సమయంలో మూడు రోజులు బయట ఉండాలనే ఆచారం అమలు చేసేవారు కాదు. అలాగే దళితులను అంటరానివారిగా చూసే రోజుల్లోనూ ఆ ఇంట్లో అలాంటి వివక్షకు చోటు ఉండేది కాదు. ఆ వాతావరణం కూడా జోయపై గాఢమైన ప్రభావం చూపించింది. దివిసీమ ప్రాంతంలోని పెద్దమ్మ సీతమ్మ ఇల్లు కమ్యూనిస్టు నాయకులకు అజ్ఞాత స్థావరం (డెన్‌)గా ఉండేది. చల్లపల్లి నారాయణరావు, చలసాని వాసుదేవరావు, దుర్గారావు తదితర నాయకులు అక్కడ రహస్యంగా ఆశ్రయం పొందేవారు. మలబార్ పోలీసులు తరచూ ఇళ్లకు వచ్చి నిర్బంధాలు కొనసాగించడం, ఇంట్లోని పురుషుల గురించి వివరాలు అడుగుతూ కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి సంఘటనలు చిన్న వయసులోనే జోయ చూశారు. "పేదలకు జమీందారీ భూములు పంచాలని కోరడమే కమ్యూనిస్టులు చేసిన నేరమా?" అనే ప్రశ్న ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. లంక భూములు దళితులకు, పేదలకు చెందాలని డిమాండ్ చేస్తూ చినకళ్లేపల్లిలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగేవి. జోయ ఇల్లు పార్టీ కార్యాలయంగా ఉండేది. మహిళలు కోలాటాలు నేర్చుకునేవారు. యువకులు మిలిటరీ బ్యాండ్‌లో శిక్షణ పొందేవారు.

అప్పట్లో గోగినేనిపాలెం చింతలతోపులో కోడిపందాలు నిర్వహించేవారు. యువతను సన్మార్గంలో నడిపేందుకు యువజన సంఘాలు చెడుగుడు తదితర క్రీడా పోటీలు నిర్వహించి చైతన్యం కల్పించేవి. గ్రామంలో కలరా వ్యాపిస్తే మందులు వేయడం, దళితవాడను శుభ్రపరచడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉద్యమకారులు పాల్గొనేవారు. ఆ రోజుల్లో చినకళ్లేపల్లి రాజకీయ, సామాజిక చైతన్యానికి కేంద్రంగా నిలిచింది. మహిళలు వరి కోతకు వెళ్లి సంపాదించిన కూలి డబ్బులో కొంత భాగాన్ని కమ్యూనిస్టు పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. చదువుకునే రోజుల్లో జోయ తండ్రి ఉద్యమాల్లో పాల్గొనడాన్ని సహించలేని కాంగ్రెస్ సేవాదళ్ వాలంటీర్లు నాటు తుపాకులు చూపించి బెదిరించేవారు.

Joyamma

1959లో ఆమెకు యార్లగడ్డ రామనరసింహంతో వివాహమైంది. పిల్లల చదువుల నిమిత్తం 1972లో విజయవాడ పటమటలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆమె పెద్దమ్మ గుత్తికొండ సీతమ్మ పిల్లలను చదివిస్తూ, జోయకు విజయవాడలో అండగా ఉండేవారు. ఆమె కూడా పార్టీలో పనిచేసేవారు. 1977లో దివిసీమ ఉప్పెన సందర్భంగా పార్టీ, మహిళా సంఘాలు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జోయ, మానికొండ సూర్యావతి, దండమూడి భిక్షావతి, తులసమ్మలతో కలిసి బట్టలు, ఆహార పదార్థాలు, నగదు సేకరించి కోడూరు వెళ్లి తుపాను బాధిత కుటుంబాలకు అందజేశారు. అప్పటి నుంచే కమ్యూనిస్టు పార్టీతో, మహిళా సంఘంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. విజయవాడలో పిల్లలను చదివించుకుంటూనే ఖాళీ సమయంలో మహిళా సంఘంలో చురుగ్గా పనిచేసేవారు. అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి మహానాయకులు తుపాను బాధితుల సేవలో నిమగ్నమై ఉండటాన్ని చూసి ఆమె మరింత స్ఫూర్తిని పొందారు. అనంతరం మోటూరు ఉదయం, మోటూరు హనుమంతరావు వంటి నాయకులతో ఆమెకు సన్నిహిత పరిచయం ఏర్పడింది.

1980లో మహిళా సంఘం రాష్ట్ర రెండో మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. భూస్వామ్య కుటుంబాలకు చెందిన యువత ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐలో చేరేందుకు ఆమె విశేషంగా కృషి చేశారు. సీపీఎం నందిగామ డివిజన్ కార్యదర్శిగానూ పనిచేశారు. మహిళలకు సమాన హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. చందర్లపాడులో పాల కేంద్రం ఏర్పాటుకు కృషి చేసి, జిల్లాలోనే ఉత్తమ పాల సొసైటీగా అవార్డు అందుకునేలా చేశారు. 1986లో విజయా పాల కేంద్రం జిల్లా డెయిరీ డైరెక్టర్‌గా ఎన్నికై సమర్థవంతంగా పనిచేశారు. చందర్లపాడులో రేషన్ షాపును నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె స్వయంగా బాధ్యతలు చేపట్టి నడిపించారు.

అనేక ఉద్యమాల్లో ...

సుబాబుల్‌ కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సుబాబుల్‌ రైతుల సంఘం రాష్ట్ర నాయకురాలిగా పనిచేసి పలు రాష్ట్రస్థాయి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. పలుమార్లు గిట్టుబాటు ధర పెంపు కోసం కృషి చేశారు. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన ఉద్యమాల్లో ఆమె సమరశీలంగా పోరాడారు. 1990 ప్రాంతంలో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమంలో నందిగామ ప్రాంతంలో జోయ, చావా నాగసూర్యామణి, చదల జానకిరామయ్య, వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. 2005లో వీరులపాడు మండలం జుజ్జూరు సెంటర్‌లో బ్రాందీ షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించి దానిని వేరే చోటుకు మార్పించడంలో కీలకపాత్ర పోషించారు. జోయ, కాట్రగడ్డ స్వరూపరాణి, పిన్నమనేని విజయ, చాంద్‌బేగం తదితరులు బ్రాందీ షాపు ముందు ధర్నా నిర్వహించి, మద్యం సీసాలు పగులగొట్టి దానిని మూయించారు. గుంటూరు బాపనయ్య, పాటూరు రామయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందేందుకు ఆమె తనవంతుగా దివి ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘం ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో మోటూరు ఉదయం, సూర్యావతి, నాగళ్ల రాజేశ్వరమ్మ, భిక్షావతి తదితర నాయకులతో కలిసి పనిచేశారు. చెవుటూరు కాల్వ తవ్వకం కోసం చేపట్టిన ఉద్యమంలో మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) సభ్యురాలిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమాల్లో, పార్టీలో సీనియరుగా ఉన్నా, ఏ బాధ్యతల్లో ఉన్నాఒక సాధారణ కార్యకర్తగానే నిరాడంబరంగా మెలిగేవారు. పార్టీ నాయకత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ ఉద్యమాలకు అంకితభావంతో పనిచేశారు. జోయ ఎందరో కార్యకర్తలను అమ్మలా ఆదరించారు. ప్రజలందరికీ అన్ని హక్కులూ, అన్ని సదుపాయాలూ సమకూరాలని జీవితాంతం పరితపించారు. సమ సమాజం ఏర్పడాలనే తపనకు, ఆచరణకు ఆమె జీవితం ఒక నిదర్శనం, మార్గదర్శకం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్