mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసేవలు సులభం..

11 గంటల క్రితం

Cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

  • ఫిర్యాదులుగా వాయిస్‌ మెసెజ్‌‌లు

  • ఆర్‌‌టిజిఎస్ సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్‌‌టిజిఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని సూచించారు. సేవల్ని సులభతరం చేసే ప్రక్రియను మొదలుపెట్టామని, ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సిఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తూ.. ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమశాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్‌‌మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్‌తో పాటు.. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలెట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఒడిలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్క్యలర్‌ జారీ చేసినట్టు అధికారులు వివరించారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని సిఎం ఆదేశించారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, ప్రతినిధులను వెంటపెట్టుకుని సిఎం చంద్రబాబు ఆర్‌‌టిజిఎస్ కేంద్రానికొచ్చారు. ఆర్‌‌టిజిఎస్ పనితీరును ఐటి సెక్రటరీ కాటంనేని భాస్కర్.. సిఐఐ ప్రతినిధులకు వివరించారు. ఎఐ సహా వివిధ టెక్నాలజీలను పరిపాలనలో ఏ విధంగా వినియోగిస్తున్నామనే అంశాన్ని భాస్కర్ వెల్లడించారు. ఈ సమావేశానికి సిఎస్ సాయి ప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్