కనెక్టివిటీ టూ లాస్ట్ మైల్ లక్ష్యం
డిజిటల్ లిటరసికీ ఆపరేటర్ల సహకారం
నెట్వర్క్ బలోపేతంపై సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలు
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ దిశగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్వర్క్‌ను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై సిఎం వివిధ సర్వీసు ప్రొవైడర్లు, ఉన్నతాధికారులతో సమీక్షను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ కవరేజి విషయంలో సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,694 సెల్ టవర్లు ఉన్నాయని, మరో 2,310 సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రికి ఐటి, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. అవసరమైన మేరకు సర్వీసు ప్రొవైడర్‌లకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వంద రోజుల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భౌగోళికంగా కవరేజి లేని ప్రాంతాల వివరాలను ఇస్తామన్నారు. రాజధాని అమరావతిలో ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడా తవ్వకాలు జరక్కుండా ప్రతి ఇంటికీ ఫైబర్ నెట్వర్క్ అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,69,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్‌తో పాటు 28.67 లక్షల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సమాచార నెట్వర్క్ అంశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
డిజిటల్ లిటరసీకి సహకారం
రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ లిటరసీకి కూడా సర్వీసు ప్రొవైడర్లు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా అందిస్తున్న వివిధ సేవలు, సంజీవని పథకం సహా వివిధ టచ్ పాయింట్ల సేవల్ని సమర్ధంగా వినియోగించుకునేలా ఈ డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందన్నారు. ప్రజలను డిజిటల్ లిటరేట్లుగా మారిస్తే మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కువ సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. త్వరలో ఎఐ ఆగ్రానమిస్ట్, ఎఐ డాక్టర్, ఎఐ ట్యూటర్ లాంటి వేర్వేరు సేవల్ని వినియోగదారులు ఉపయోగిం చుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాతిపదికన అన్ని ప్రాంతాలకూ పూర్తి మొబైల్ కవరేజి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమీక్షకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.









కామెంట్‌లు (0)