సాయికృష్ణ కేసులో ఆర్‌ఎంపి స్టేట్‌మెంట్ రికార్డు
ఇన్‌ఫార్మర్ లేడీ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజాశక్తి - విజయవాడ:పోలీస్ స్టేషన్‌లో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణకు కృష్ణలంకలోని ఓ ఆర్ఎంపితో రహస్యంగా వైద్యం అందించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే సాయికృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ బయటికి రాగానే అతను పరారయ్యాడు. కొద్ది రోజులు అమెరికా వెళ్లి పోయి తిరిగి విజయవాడకు వచ్చిన ఆర్‌ఎంపిని అరెస్టు చేసి విచారించారు. సాయికృష్ణను స్టేషన్‌కు ఎందుకు పిలిచారు? ఆ సమయంలో అతని పరిస్థితి ఏమిటి? ఒంటిపై గాయాలు ఉన్నాయా? ఎలాంటి చికిత్స అందించారు? వంటి పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని పిలవడం వల్లే తాను సాయికృష్ణకు వైద్యం చేయడానికి వెళ్లానని ఆర్‌ఎంపి సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది.
సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, ఆ గాయాలు బయటకు తెలియకుండా, మృతదేహాన్ని మాయం చేసేందుకు బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా సిసిపుటేజ్ టెక్నీషియన్‌పై దృష్టి సారించారు. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసి విచారించనున్నట్లు తెలిసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇన్‌ఫార్మర్‌గా మహిళా కానిస్టేబుల్ వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. ఎవరిని విచారించారు? ఏయే అంశాలు అడిగారు? వంటి విషయాలన్నీ చేరవేసినట్లు గుర్తించారు. లొంగిపోయిన కానిస్టేబుల్ అశోక్, నానిని దాదాపు ఎనిమిది గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. పలు అంశాలను వీళ్ల ముందు ఉంచి ప్రశ్నించారు. అయితే ప్రతి దానికి సమాధానం దాటవేసినట్లు తెలుస్తుంది.









కామెంట్‌లు (0)