mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6న కలెక్టరేట్ల వద్ద ధర్నా :ఎస్‌ఎఫ్‌ఐ

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్‌ బిల్లులు రూ.3 వేలకు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న జరిగే కలెక్టరు కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్న కుమార్‌ పిలుపునిచారు. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో విలేకరుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కె ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించలేదని, ఫీజులను సకాలంలో చెల్లించి సక్రమంగా చదువు కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదన్నారు. ఫీజుల బకాయిలు మరింత భారంగా మారి రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత చదువులు గందరగోళంగా మారాయన్నారు. ఇది ప్రైవేటు విద్యా సంస్థల్లోనే కాదని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో సైతం ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతినిస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల రాయలసీమ యునివర్సిటీ ఫీజు చెల్లిస్తేనే హాస్టల్ ఓపెన్ చేస్తామని తాళాలు వేసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మౌనం వీడి తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్‌ ‌మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదని, మెస్ బిల్లులు పెంచడం లేదని అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంపై నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసి పేద విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్‌‌మెంట్ లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు తప్ప మరొకటి కాదని అన్నారు. తక్షణమే ఇలాంటి విధానాలను అడ్డుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రవి, సిహెచ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రణీత, నాయకులు షణ్ముఖ్, యశస్విని పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్