mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA World Cup: జర్మనీ, నెదర్లాండ్స్‌ ‌షూ‘టౌట్‌’

1 గంట క్రితం

moracco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ప్రీ క్వార్టర్స్‌‌కు మొరాకో, పరాగ్వే

  • రౌండ్‌-32లోనే నిష్ర్కమించిన 4సార్లు ఛాంపియన్‌

ఫిఫా ప్రపంచకప్‌ 2026 రౌండ్‌-32 (నాకౌట్‌)‌లో పెను సంచలనాలు నమోద య్యాయి. నాలుగుసార్లు ఛాంపియన్‌ ‌జర్మనీ జట్టును పరాగ్వే చిత్తు చేయగా.. మూడు సార్లు రన్నరప్‌ ‌నెదర్లాండ్స్‌‌ను మొరాకో జట్టు ఓడించింది. ఈ రెండు ఫలితాలు పెనాల్టీ షూటౌట్‌‌ ద్వారానే రావడం మరో విశేషం. నిర్ణీత, అదనపు సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1గోల్స్‌‌తో సమంగా నిలువగా.. షూటౌట్‌‌లో మొరాకో 4-2తో నెదర్లాండ్స్‌‌ను, పరాగ్వే జట్టు 4-3తో జర్మనీని ఓడించి ప్రి క్వార్టర్స్‌‌కు చేరాయి. దీంతో ఫిఫా ప్రపంచకప్‌ ‌చరిత్రలో తొలిసారి జర్మనీ, నెదర్లాండ్స్‌ రౌండ్‌-32లోనే ఇంటి‌దారి పట్టాయి.

న్యూయార్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో రౌండ్‌-32లో సంచనాలు నమోదవుతున్నాయి. మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌కు మొరాకో తొలి ఝలక్ ఇచ్చిన కొద్ది గంటలకే 4సార్లు ఛాంపియన్ జర్మనీకి పరాగ్వే చెక్ పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను మొరాకో సమర్ధవంతంగా నిలువరించింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లూ గట్టిగా ఫైట్ చేసినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇక రెండో అర్ధభాగంలో మ్యాచ్ జోరందుకుంది. 72వ నిమిషంలో నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ కోడి గాక్పో అదిరిపోయే గోల్ కొట్టి తన టీమ్‌కు 1-0 ఆధిక్యతలో నిలిపాడు. ఈ ఒక్క గోల్‌తో నెదర్లాండ్స్ మ్యాచ్ గెలిచేసిందనుకున్న దశలో సరిగ్గా ఇంజూరీ టైమ్‌లో మొరాకో ప్లేయర్ ఇసా డియోప్ హెడర్ ద్వారా మిరాకిల్ గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ 1-1తో సమం కావడంతో అదనపు సమయానికి దారితీసింది. అదనపు సమయంలోనూ ఏ జట్టూ గోల్‌ ‌చేయలేదు. ఒకానొక దశలో మొరాకో టీమ్ చాలా సార్లు గోల్ పోస్ట్ దగ్గరకు దూసుకొచ్చినా గోల్ చేయలేకపోయారు. అయితే, నెదర్లాండ్స్ గోల్ కీపర్ బార్ట్ వెర్‌బ్రగ్గన్ అద్భుతమైన సేవ్స్‌తో టీమ్‌ను ఆదుకున్నాడు. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా స్కోరు 1-1తోనే ముగిసింది. షూటౌట్‌లో నెదర్లాండ్స్ ఏకంగా మూడు కిక్‌లను మిస్ చేసింది. మొరాకో కూడా రెండు కిక్‌లను చేజార్చుకొని మూడు గోల్స్‌ ‌చేసింది. షూటౌట్ సమయంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు జస్టిన్ క్లైవర్ట్, క్వింటన్ టింబర్, క్రిసెంసియో సమ్మర్‌విల్లే తమ కిక్‌లను గోల్స్‌ కొట్టడంలో విఫలమయ్యారు. అటు మొరాకో టీమ్‌లో నైల్ ఎల్ అయ్నోయి, కెప్టెన్ అష్రఫ్ హకీమి కిక్‌లను చేజార్చుకున్నారు. అయితే, డచ్ ప్లేయర్ క్రిసెంసియో సమ్మర్‌విల్లే కొట్టిన ఐదో కీలక కిక్‌ను మొరాకో గోల్ కీపర్ యాసిన్ బోనో తన ఎడమ చేత్తో అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. దీంతో బోనో ఈ మ్యాచ్‌కు రియల్ హీరోగా నిలిచాడు. స్టేడియం మొత్తం మొరాకో అభిమానుల అరుపు లతో హోరెత్తిపోయింది. ఈ గెలుపుతో మొరాకో జట్టు ప్రీ క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరింది. శనివారం జరిగే ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లో మొరాకోజట్టు ఆతిథ్య కెనడాతో తలపడనుంది.

parague goal keer

జర్మనీ తొలిసారి పరాగ్వే చేతిలో..

పటిష్ట డిఫెన్స్‌‌కు పేరుగాంచిన 4సార్లు ఛాంపియన్‌ ‌జర్మనీ జట్టు ఈసారి రౌండ్‌-32లోనే నిష్ర్కమించింది. బోస్టన్ ఫాక్స్‌బరో స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్‌ ప్రారంభం నుండీ జర్మనీ ‌జట్టు పట్టు బిగించింది. టాప్ స్కోరర్ డెనిజ్ ఉండావ్ నేతృత్వంలో దూకుడుగా ఆడింది. మ్యాచ్ 35వ నిమిషం వరకు జర్మనీ దాదాపు 244 పాస్‌లు పూర్తి చేసినా గోల్‌ను మాత్రం నమోదు చేయలేకపోయింది. అదే సమ యంలో పరాగ్వే కౌంటర్ అటాకింగ్ వ్యూహాన్ని అమలు చేసింది.

మిగ్యుల్ అల్మిరాన్ కుడి వైపు నుండి అందించిన అద్భుతమైన పాస్‌ను జూలియో ఎన్సిసో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి పరాగ్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో జర్మనీ రెండో అర్ధబాగం 54వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన క్రాస్‌ను కై హ్యావర్ట్జ్ అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత 102వ నిమిషంలో జర్మనీ డిఫెండర్ జోనాథన్ థా వేసిన హెడర్ గోల్ జర్మనీని విజయతీరాలకు చేర్చాడని భావించినా.. వీఏఆర్ సమీక్ష తర్వాత పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్‌పై ఫౌల్ చేసినట్లు నిర్ధారించడంతో ఆ గోల్‌ రద్దయింది. దీంతో నిర్ణీత, అదనపు సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటౌట్లో పరాగ్వే 4-3 తేడాతో జర్మనీపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. జర్మనీకి చెందిన స్టార్ ఆటగాళ్లు కై హ్యావర్ట్జ్, నిక్ వోల్టెమేడ్, జోనాథన్ థా పెనాల్టీలను గోల్‌ చేయలేదు.

దీంతో 140 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ జట్టు తొలిసారి పెనాల్టీ షూటౌట్‌లో ఓడింది. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ తర్వాత పరాగ్వేకు దక్కిన అతిపెద్ద విజయం ఇదే. మరోవైపు 1954, 1975, 1990, 2014లలో ఛాంపియన్ అయిన జర్మనీ 2018, 2022 తర్వాత రౌండ్-32లోనే నిష్ర్కమించింది. ఫ్రాన్స్‌ - స్వీడన్‌ ‌మ్యాచ్‌ ‌విజేతతో ప్రిక్వార్టర్‌‌ఫైనల్లో పరాగ్వే తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్