కుల మతాలకు అతీతంగా నిలిచిన వ్యక్తి
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ : అవనిగడ్డ వీర వర్మ కుటుంబం కుల మతాలకు అతీతంగా లౌకికవాదాన్ని ప్రోత్సహించిన వ్యక్తి అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. వీర వర్మ 84వ జయంతి సందర్భంగా ‘నేటి భారతం ఎదుర్కొంటున్న సవాల్’ అనే అంశంపై తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. వీరవర్మ చిన్నతనం నుంచే పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని, పోస్టల్ ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడే ఉద్యమాల్లో పని చేశారని తెలిపారు. ఆయన కుటుంబంలో కులం, మతం భేదాలు లేవని, కట్నకానుకల సమస్యలే లేవని, అవనిగడ్డ కుటుంబాన్ని చూస్తే నిజమైన భారతదేశాన్ని చూసినట్టు ఉంటుందని అన్నారు.ప్రస్తుతం శ్రమ చేసే వారికి విలువ లేదని, దోచుకునే వారిదే కాలమని ఎద్దేవా చేశారు. నేటి పాలకులు జాతీయ సంపదను దోచేస్తూ, లేబర్ కోడ్‌ల పేరుతో కార్మికుల జీవితాలను కాలరాస్తున్నారని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేపట్టి న యుద్ధం నేటికీ కొనసాగుతుందన్నారు. ఆ యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంలో క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధానికి ముందు ముడి చమురు (బ్యారెల్ ధర) 70 డాలర్లు ఉంటే, యుద్ధం సమయంలో 120 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం 70 డాలర్లకు తగ్గిందని, అయినా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గలేదన్నారు. దేశంలో ప్రజలపై భారాలు పెరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ప్రధాని మోడీ కనీసం ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత పాలకులు అమెరికాకు సహాయం చేయడానికి దేశానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మోడీ ప్రభుత్వం లౌకికవాదానికి తూట్లు పొడుస్తోందని, రాష్ట్రంలో టిడిపి, జనసేన సైతం ఆర్ఎస్ఎస్ భావాలను భుజాన వేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఆహారం, ఆఖరికి ఒకే బట్ట అనే విధంగా పాలకులు వ్యవహరించడం దారుణమన్నారు. తాజాగా దేశంలో ‘ఎస్ఐఆర్’ పేరుతో ఓట్లు మాయం చేసే తంతు జరుగుతుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని తెలిపారు. అంతకుముందు వీర వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి.సుబ్రహ్మణ్యం, ఆర్ పిఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు అంజయ్య, వీరవర్మ సతీమణి, కుమార్తెలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)