- మంటలు చెలరేగి ఏడుగురు మృతి
జైపూర్: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి ఇండోర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ట్రైలర్‌ను ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం అనంతరం బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య జరిగింది. ట్రైలర్‌ను ఢీకొన్న వెంటనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బలమైన ఢీకొట్టడం వల్ల పై బెర్త్‌లలో ఉన్న వారు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలు పూర్తిగా వ్యాపించకముందే కొంతమంది ప్రయాణికులు బస్సు నుంచి బయటపడగలిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన కొందరిని వైద్య కళాశాలలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సు, ట్రైలర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బస్సు అదుపుతప్పి ట్రైలర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.








కామెంట్‌లు (0)