mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కంటి ముందర...

1 రోజు క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

యెద్దును లేపి, ఏరును పూసి,

ఏటి ఒడ్డున బాడవ దున్ని,

ఎదురుగ పూసిన పొద్దును చూసి

ముద్దులాడినావా?

వెలుగు నీళ్లతో తాన్నమాడినావా?

...

మీదకి చూసావా?

నీటి కోసం కళ్లజోడును నింగికి తొడిగావా?

కిందకి చూసావా?

రెక్కల తాళ్లతో ఏతామేసి

పాతాళాన్ని పలకరించినావా?

నీటిని తోడి సిలకరించినావా?

...

పస్తులు పడ్డావా? పుస్తులు అమ్మావా?

విత్తులు కొన్నావా? బగ్గిల జల్లావా?

ఆకుపచ్చని ఆకాశాన మొక్కల చుక్కలు చూసి

మురిసిపోయినావా?

పురుగు మందులు పుట్లుకొలదిగా

పంటను తిన్నాయా?

పున్నెం మూట కట్టుకుపోయాయా?

...

అప్పులు తోడావా?

పట్నం పోయావా? పెస్టిసైడ్లు కొన్నావా?

పురుగులు చావక, అప్పులు తీరక,

పులుసుబువ్వలో పురుగు మందును కలిపావా?

కంటి ముందర గుంటలు కనబడి

కన్నీటిని తాగావా?

...

పట్టవు కొడుకా! ఏలినవారికి

నీ కష్టబాధలెప్పుడు?

పండిన పంటకు గిట్టుబాటు ధర

బొడికొండపై వాన కురిసినట్టు.

ఎన్నికలొస్తే రైతువు కాదు, రాజైపోతావు!

ఓటును వొదిలి వొట్టిపోయిన గోవే అవుతావు!

...

ఎగరడానికి రెక్కలు రావు

రాలిన చోటే మొలవాలంటావు

పోయిన చోటే వెతకాలంటావు

సూర్యచంద్రులను గిలకలు చేసి ఆడిస్తూ ఉంటావు

చెమట నీళ్లతో ఆకలి మంటలు ఆర్పుతూ ఉంటావు!

- చింతా అప్పలనాయుడు

94417 13185


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్