సూఫీ తాత్వికతను కవిత్వ శ్వాసగా మలుచుకున్న ఏటూరి నాగేంద్రరావు గారి ఏడో కవితా సంపుటి 'ఒక అశాంతుడి స్వప్నం'. 62 కవితలతో కూడిన ఈ సంపుటిలో వ్యవస్థతో సంఘర్షించే ఒక సామాన్యుడి మనోగతం, విలువల కోసం పోరాడే వ్యక్తి అంతర్మథనం, సమకాలీన జీవితంలోని వైరుధ్యాలు ప్రతిధ్వనిస్తాయి. క్లుప్తత, గాఢత, జీవితానుభవం, తాత్విక ధోరణి ఈ కవిత్వానికి ప్రధాన లక్షణాలు. 'దయాపూరిత కనులస్పర్శ' కవితలో 'కార్పొరేట్ హాస్పిటల్ / పొద్దున్నే నా పక్కన / మత్తుగా నిద్ర లేస్తుంది' అనే ప్రారంభమే కవితా వస్తువును ప్రత్యేకంగా నిలబెడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రిని సజీవ పాత్రగా చూపించిన ఈ రూపకం కవిత్వాన్ని విభిన్న స్థాయికి తీసుకెళ్తుంది. చివర్లో 'ఎన్ని దుఃఖపు పాటలు / చెవుల్లో మార్మోగుతున్నా / ఒక కొత్త పాటను / కలగంటూనే ఉంటాను' అనే పంక్తులు జీవితంపై ఆశను నిలబెడతాయి. 'గుండె గాయం', 'విషాద మాధుర్యం', 'కలల విచ్చిత్తి' వంటి కవితల్లో ఏకాంతం, భయం, కలల విచ్ఛిన్నం, మనిషి అంతరంగ సంఘర్షణలు తాత్విక ధోరణితో వ్యక్తమవుతాయి. 'ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి' అనే వ్యాఖ్య ఆధునిక సమాజంలోని అనాసక్తిని సూచిస్తుంది. 'ప్రేమించడం' కవితలో అక్షరాల పట్ల మమకారాన్ని, 'ఎర్రపూల సౌందర్యం'లో యువత పట్ల బాధ్యతను, 'సంఘర్షణ రూపాలు'లో మనిషిలోని అంతర్గత శక్తిని కవి గుర్తు చేస్తారు. 'నీ శక్తిని అడుగు... కడలిలో ఉండే అలల ఘోష నీది కాదా?' అనే ప్రశ్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే ప్రయత్నంగా కనిపిస్తుంది. 'పాలుపోక', 'ప్రశ్న కూడా కావచ్చు', 'తొంగి చూడు', 'ఎక్కుపెట్టిన మౌనం', 'ఎగాదిగా', 'కాలిపోయిన కలలు', 'ఉత్సవం' వంటి కవితలు కుటుంబ సంబంధాలు, గేటెడ్ కమ్యూనిటీల జీవితం, సామాజిక అసమానతలు, మౌనం, భక్తి పేరుతో పెరుగుతున్న ఆడంబరాలను స్పృశిస్తాయి. 'గులాబీ' కవితలో దాంపత్యానుబంధం సున్నితంగా వ్యక్తమవుతుంది. ఈ సంపుటిలో 'విషాద మాధుర్యం', 'రెక్కలు లేని గీతం', 'రణసంచారి' వంటి శీర్షికలతో పాటు 'రణక్షేత్రం', 'శాద్వల ఛాయ', 'అంతరాల కందకాలు' వంటి పదబంధాలు కవి భాషా వైవిధ్యాన్ని తెలియజేస్తాయి.
ప్రతులకు : 74166 65323 - అన్నం శివకృష్ణ ప్రసాద్ 94903 25112









కామెంట్‌లు (0)