6 వికెట్ల తేడాతో ఆస్ర్టేలియా గెలుపు
మహిళల టి20 ప్రపంచ కప్ నుంచి *టీమ్ ఇండియా నిష్ర్కమణ
లండన్ : ‘మహిళల టి20 ప్రపంచ కప్ 2026’ భారత్ పోరాటం ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో ఛేదించింది. ఎలీసా పెర్రీ (56; 38 బంతుల్లో 8 ఫోర్లు), ఆష్లీ గార్డ్‌నర్ (53; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. బెత్ మూనీ 22, లిచ్‌ఫీల్డ్ 24 రన్స్ చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2 వికెట్లు.. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. గ్రూప్ ఎ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. లండన్‌లో లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ శతకం (56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగులతో అజేయంగా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. అయితే, ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్‌నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.









కామెంట్‌లు (0)