మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖ సదస్సులో ప్రజాప్రయోజన ఒప్పందాలు నిల్

11 నిమిషాల క్రితం

విశాఖ సదస్సులో ప్రజాప్రయోజన ఒప్పందాలు నిల్
- రాష్ట్రాన్ని ప్రైవేటు ప్రయోజనాలకు వేదికగా మార్చే విధానాలను  ప్రశ్నించాలి
- బిర్సా ముండా 151వ జయంతి వారోత్సవాలలో వి. శ్రీనివాసరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్రాన్ని ప్రైవేటు ప్రయోజనాలకు వేదికగా మార్చే విధానాలను ప్రశ్నించాలి

  • బిర్సా ముండా 151వ జయంతి వారోత్సవాలలో వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన ఒప్పందాలు ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పెద్దగా కనిపించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఇటువంటి సదస్సుల నిర్వహణకు ఖర్చు చేస్తున్న నిధులను ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలకు వినియోగించి ఉంటే వాటిని పూర్తి చేయడానికి అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. దేశ వనరులు, మేధో సంపదను కొల్లగొట్టి రాష్ట్రాన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనాలకు వేదికగా మార్చే విధానాలను ప్రజలు ప్రశ్నించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన ఆశాజ్యోతి బిర్సా ముండా 151వ జయంతి వారోత్సవాల సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్‌లో సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశంలోని సహజ వనరులు, ఖనిజ సంపదను కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వాలు ధారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల పేరుతో ప్రైవేటీకరించడం ద్వారా కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉంటేనే సామాజిక న్యాయం, ఉద్యోగ భద్రత, రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని అరుదైన ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్, సాంకేతిక పరిజ్ఞానం వంటి కీలక వనరులను విదేశీ, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో ప్రచారం చేస్తున్నప్పటికీ చిప్స్, సెమీకండక్టర్ల వంటి కీలక సాంకేతిక రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్ విద్యుత్, డేటా సెంటర్ల ఏర్పాటు పేరుతో సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఆదివాసీల హక్కులు, కార్మికుల సంక్షేమం, ప్రజాస్వామ్య విలువల కోసం అన్ని ప్రజాసంఘాలు, కార్మిక, రైతు, గిరిజన సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సభ ప్రారంభంలో బిర్సా ముండా చిత్రపటానికి వి. శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జివిఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్