- న్యాయశాస్త్రంతో పాటు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి
- ఎఐ వినియోగంలో మానవ పర్యవేక్షణ కీలకం
- జస్టిస్ కె.రామస్వామి స్మారకోపన్యాసంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): న్యాయశాస్త్రంపై పట్టు సాధించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యాయ విద్యార్థులకు సూచించారు. నిస్సహాయుల పక్షాన నిలబడి, నిర్భయంగా సత్యాన్ని సమర్థించాలని, దేశంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం సమానంగా అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జస్టిస్ కె.రామస్వామి స్మారకోపన్యాసంలో ఆయన పాల్గొన్నారు. 'డిజిటల్ యుగంలో న్యాయవాద వృత్తి - అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జస్టిస్ కె. రామస్వామి జీవితం, ఆయన న్యాయరంగానికి అందించిన సేవలు, సామాజిక న్యాయం పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. చట్టం కేవలం పరిపాలనా సాధనం కాదని, అణగారిన వర్గాలకు గౌరవం, సమానత్వం కల్పించే సాధనమని వివరించారు. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ (ఎఐ) న్యాయరంగంలో అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని, అదే సమయంలో కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తున్నాయన్నారు. జిల్లా కోర్టుల్లో పనిచేసే సాధారణ న్యాయవాదులకు కూడా కార్పొరేట్ న్యాయవాదులతో సమానంగా డిజిటల్ వనరులు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎఐ ద్వారా లభించే సమాచారాన్ని పూర్తిగా నమ్మకుండా, ప్రామాణిక ఆధారాలతో ధ్రువీకరించుకోవాలని, డీప్‌ఫేక్‌ల వంటి సాంకేతిక మోసాలను గుర్తించే పరిజ్ఞానాన్ని న్యాయ విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ఎఐ వినియోగంలో మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా దృక్పథాన్ని విశ్వవిద్యాలయాలు పెంపొందించాలని, ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించుకునేలా న్యాయ విద్యను తీర్చిదిద్దాలని సూచించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మానవత్వం, నైతిక విలువలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడి పౌరుల స్వేచ్ఛను కాపాడే బాధ్యత న్యాయవాదులదేనని తెలిపారు. ఈ సందర్భంగా ఎయు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోబోనో క్లబ్ (న్యాయ బంధు)ను ఆయన ప్రారంభించారు. ఎయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి.రాజశేఖర్ మాట్లాడుతూ... ఎయు పూర్వ విద్యార్థిగా జస్టిస్ కె. రామస్వామి న్యాయరంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, చారిత్రాత్మక తీర్పులతో ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సమాజంలోని అత్యంత పేదవారికి న్యాయం అందినప్పుడే చట్టానికి పరిపూర్ణత చేకూరుతుందని జస్టిస్ రామస్వామి విశ్వసించేవారని గుర్తు చేశారు. జస్టిస్ కె.రామస్వామి కుమారుడు, సీనియర్ ఐఎఎస్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్మారకోపన్యాసం తమ కుటుంబానికి, ఎయు పూర్వ విద్యార్థులకు గర్వకారణమన్నారు. జస్టిస్ రామస్వామి జీవిత ప్రయాణం, న్యాయ రంగానికి ఆయన చేసిన సేవలను న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతామాణిక్యం వివరించారు. కార్యక్రమంలో ఎయు రెక్టార్ ఆచార్య పులపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డీన్ ఆచార్య కె.రమా సుధ, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను విశ్వవిద్యాలయం తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.






కామెంట్లు (0)