- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి- తిరుపతి (మంగళం) : రానున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు కోరితే పోలీస్ ఎస్కార్ట్ నడుమ నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. సాధారణ నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కలెక్టర్, ఎస్సిలు భావిస్తే వెంటనే జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రానున్న పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేలా, ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శనివారం ఆయన తిరుపతి కలెక్టరేట్లోని విసి హాలులో ఎడిజి మధుసూదన్ రెడ్డి, ఐజిపి రాజకుమారి, ఎన్నికల పరిశీలకులు వరప్రసాద్ లతో కలసి రాష్ట్రంలోని 12 జిల్లాల ఎస్పిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అందుబాటులో ఉన్న పోలీసు బలగాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రతి మండలంలో రెండు లేదా మూడు గ్రామాలను కలిపి క్లస్టర్ స్థాయిలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని, నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద తప్పనిసరిగా సిసిటివి నిఘా, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులు, వినతులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం జిఒ జారీ చేసిందని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన పంచాయతీలకే ఈ ప్రోత్సాహకాలు అందుతాయని వివరించారు. ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, బలవంతపు చర్యలకు తావుండకూడదని, ఎన్నికలు పూర్తిగా స్వచ్ఛందంగా, పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.
ఎడిజి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో రాబోయే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఐజిపి రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటివరకు మొత్తం 1,182 ఫిర్యాదులు అందాయన్నారు.
నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ సమయంలో అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, అడ్డుకోవడం, కిడ్నాప్, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి నివేదికలు రప్పించి తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ముందు ఎస్పిలు తమ జిల్లా పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన బందోబస్తు, తదితర వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, అనంతపురం, కర్నూల్ రేంజ్ ఐజిపిలు షిమోషీ, డిఐజి కె.ప్రవీణ్, తిరుపతి ఎస్పి ఎల్.సుబ్బారాయుడు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పిలు నేరుగా హాజరు కాగా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం ఎస్పిలు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.








కామెంట్లు (0)