mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆధార్‌ పిటిషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

2 రోజుల క్రితం

Supreme Court seeks responses of Centre, States
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 04:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఆధార్ కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై స్పందన తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఇతర కేసులతోనే ఈ పిటిషన్‌ను కూడా జత చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఉడాయ్ జారీ చేసే ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం, పుట్టిన తేదీ లేదా చిరునామా ధృవీకరణ కోసం చాలామంది వినియోగిస్తున్నారని, దీంతో ఆధార్ దుర్వినియోగం అవుతోందని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తరపున న్యాయవాది అశ్వనీ దూబే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పరిమితం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు (ఫారం-6 లో) పుట్టిన తేదీకి, నివాసానికి రుజువుగా ఆధార్ కార్డును వాడుతున్నారని, ఇది ఆధార్ చట్టం-2016 లోని సెక్షన్ 9 కి, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 23(4) కి, అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కి విరుద్ధమని పిటిషనర్ వాదించారు.

ఆధార్ అనేది పౌరసత్వానికి లేదా నివాసానికి నిరూపణ కాదని ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 స్పష్టం చేసింది. అలాగే ఆధార్ అనేది కేవలం ఒక వ్యక్తి గుర్తింపునకు మాత్రమే సాక్ష్యం కానీ, అది పౌరసత్వాన్ని, చిరునామాను లేదా పుట్టిన తేదీని ధృవీకరించే పత్రం కాదని ఉడాయ్ నోటిఫికేషన్ కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఓటరు నమోదులో ఉన్న ధృవీకరణ విధానం సరిగ్గా లేదని, దీంతో సరైన ఆధారాలు లేని వారు కూడా ఓటర్ల జాబితాలో చేరే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ధృవీకరణ వ్యవస్థలో మార్పులు చేయాలని, ఈ మార్పులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌ కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్