అమరావతి : స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 'మా ఇంటి బంగారం'లోని స్వర్ణ పాత్రలో ఉన్న 'దృఢ సంకల్పం' అనే ఒక్క లక్షణం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ పాత్రతో ప్రేమలో పడేలా చేసిందని ఆమె వెల్లడించారు. ఇంతవరకు తాను తెలుగులో పోషించిన పాత్రలన్నింటిలోకీ, తన నిజ స్వరూపానికి అత్యంత దగ్గరగా ఉన్న పాత్ర 'స్వర్ణ' అని సమంత పేర్కొనడం విశేషం. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఇది ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక, ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ .... "ఈ సినిమాలో ఎక్కడా స్లో మోషన్ షాట్స్, బిల్డప్ షాట్స్ వంటివి ఉండవు. యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. అవి నిజమైన పంచులు. వాటి చిత్రీకరణ సమయంలో నాకు కూడా దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చింది. అన్ని యాక్షన్ సీన్స్ నేనే స్వయంగా చేశాను. అందుకే అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవుతున్నాయి" అని వివరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో, రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రియుడి ఇంటికి వచ్చిన స్వర్ణకు అక్కడ పలు ప్రశ్నలు ఎదురవుతాయి. కులం, వంట, తోబుట్టువులు వంటి ప్రశ్నలతో ఆమెను విసిగిస్తారు. అయితే, "నేనెవరో మీకు తెలుసా ?" అని ఆమె ఎదురు ప్రశ్నించడం ఉత్కంఠ రేపుతుంది. "కోడలికి అందం, సన్నగా ఉండటం, వంట చేయడం వంటి ఎన్నో లక్షణాలు ఉండాలని ఆశిస్తారు. కానీ నాలో ఆ లక్షణాలు ఏవీ లేవు. నాలో ఒకే ఒక్క గుణం ఉంది. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను" అని ఆమె చెప్పే డైలాగ్, పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఈ డైలాగ్ ద్వారానే చిత్ర కథాంశం ఏమిటో స్పష్టమవుతోంది.
సెలబ్రిటీల శారీరక ఆకృతి, బరువుకు సంబంధించి సోషల్ మీడియాలో నిరంతరం సాగే చర్చలపై ప్రముఖ కథానాయిక సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తను సన్నబడటంపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. తాను కావాలని ఎలాంటి డైటింగ్ చేయలేదని, తీవ్రమైన ‘మయోసైటిస్’ (కండరాల వాపు వ్యాధి) బారిన పడటం వల్లే తన బరువు తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సులభంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
తన తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ .... "గతంతో పోలిస్తే ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది. కావాల్సిన ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాను. అయితే, అతిగా తింటే మయోసైటిస్‌పై ప్రభావం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం మితంగానే తింటున్నాను. తీవ్ర అనారోగ్య పరిస్థితుల కారణంగా నాకు తినాలని ఉన్నా తినలేని నిస్సహాయ స్థితిని అనుభవించాను. అంతే తప్ప, అందం కోసం డైటింగ్ చేసి బరువు తగ్గలేదు" అని చెప్పారు. తన పెంపుడు పిల్లికి ‘జెలాటో’ (ఒక రకమైన ఐస్‌క్రీమ్) అని పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని సామ్ వివరించారు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి ఉప్పు, కారం లేని పరిమిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ కఠినమైన రోజుల్లో కోలుకున్న తర్వాత వైద్యులు మొదటిసారిగా ‘చక్కెర లేని జెలాటో ఐస్‌క్రీమ్’ తినడానికి అనుమతించారని, ఆ జ్ఞాపకార్థమే తన పిల్లికి ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.








కామెంట్‌లు (0)