ఊరు ఎదురు చూస్తోందీ
ఏరు నిదుర లేస్తోందీ!
బడికి సెలవు లిస్తారని
వడిగ పిల్ల లొస్తారని!!
గాలిపటా లెగరేస్తూ
గోల గోలగ అరుస్తూ
మైదానంలో ఆటలు
మైమరపించే పాటలు!!
తాత కబురులను వింటూ
తాటి ముంజెలను తింటూ
చెరుకు గడలు నమిలేస్తూ
చెరువులోన ఈతేస్తూ!!
చీకటిపడితే చాలును
వెన్నెలలో చందమామ
వన్నెలు కనుటెంతొ ప్రేమ!!
అమ్మమ్మా కథలు చెప్పు
ఆశించదు ఎవరిమెప్పు!
ఎప్పిన కథలే చెప్పును
ఎప్పటికప్పుడు నప్పును!
హాయినిద్దుర సోలుతూ
తీయని కలల తేలుతూ
మరువలేని అనుభవాలు
మధురమైన జ్ఞాపకాలు!!
-”బాలబంధు“ అలపర్తి వెంకట సుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001.









కామెంట్‌లు (0)