మాధవరం గురుకుల పాఠశాలలో విక్రమ్ చదువుతున్నాడు. తెలివైనవాడే కానీ, అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ‘చదివితేనే జీవితం మారుతుంది’ అని గురువు గారు చెప్పినా, విక్రమ్ మాత్రం నవ్వేసి వెళ్లిపోతుండేవాడు. ఒకరోజు గురువు గారు పిల్లలందరినీ పక్క ఊరి పెద్ద చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. చెరువు ఒడ్డున ఒక పెద్ద వేపచెట్టు ఉంది. దాన్ని చూస్తూ గురువు గారు, ‘ఈ చెట్టు ఎందుకు ఇంత గొప్పగా నిలబడిందో తెలుసా?’ అని పిల్లలను అడిగారు. పిల్లలంతా మౌనంగా ఉండిపోయారు.
‘ఇది చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎండ తట్టుకుంది. వాన భరించింది. గాలికి వంగింది. కానీ నేలను వదల్లేదు. అందుకే నేడు వందల మందికి నీడ ఇస్తోంది’ అన్నారు. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో బలంగా నాటుకుపోయాయి.
అంతలో చెరువు పక్కన ఓ ముసలాయన జారి పడిపోయాడు. పిల్లలంతా భయంతో నిలిచిపోయారు. విక్రమ్ మాత్రం పరుగెత్తి వెళ్లి ఆయనను లేపాడు. ముసలాయన కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు. వెంటనే గురువుగారు, ‘విక్రమ్, నీకు మంచి గుండె ధైర్యం ఉంది. కానీ దానికి జ్ఞానం కలిస్తేనే మనిషి మరింత వెలుగుతాడు. ఎంత బంగారు పళ్లెమైనా గోడ చేరువు ఉంటేనే నిలబడగలుగుతుంది’ అన్నారు.
ఆ రోజు నుంచి విక్రమ్ పుస్తకాలను స్నేహితుల్లా దగ్గర చేసుకున్నాడు. బాగా చదివాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. పాఠశాలకు వెళ్లిన మొదటి రోజునే, ‘జ్ఞానం అనేది దీపం లాంటిది పిల్లలూ, అది వెలిగితే మన జీవితం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న చీకట్లు కూడా తొలగిపోతాయి’ అని విద్యార్థులతో చెప్పాడు. ఆ మాటలు విన్న పిల్లల కళ్లల్లో కొత్త వెలుగు మెరిసింది.
- సారిపల్లి నాగరాజు,
ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు,
80083 70326.
జ్ఞాన బోధ
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)