న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ వల్ల మనస్థాపంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రధానికి లేఖ రాశారు. పేపర్ లీకేజీ వల్ల ఇటీవలి వారాల్లో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 48 గంట్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అని దీప్కే లేఖలో ప్రస్తావించారు. అలాగే గత నెల రోజులుగా 'కాక్రోచ్ జనతా పార్టీ' విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ, తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ప్రశ్నాప్రతాల లీకేజీ వల్ల సంభవించిన ప్రాణ నష్టానికి కొంత బాధ్యత వహించాలని మాత్రమే విద్యార్థులుగా తాముకోరుకుంటున్నట్లు దీప్కే లేఖలో పేర్కొన్నారు.
తమ పిల్లల విద్యాపరమైన ఆశయాలను నెరవేర్చడానికి తల్లిదండ్రులు విద్యా రుణాలు తీసుకున్నారు. తమ జీవితకాల పొదుపునంతటినీ పిల్లల చదువుల కోసం వెచ్చించినప్పటికీ, చివరకు ఆ పిల్లలనే కోల్పోయిన ఈ కుటుంబాలు పూర్తిగా నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాయి. ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల తలెత్తిన సంక్షోభం కారణంగా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించాలని దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి బాధ్యత వహించి, విద్యాశాఖామంత్రిని తన పదవి నుండి తొలగించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఆయన (కేంద్ర విద్యాశాఖామంత్రి) మీ అభిష్టం మేరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంక్షోభానికి ఆయన బాధ్యత వహించకపోతే.. అంతిమ బాధ్యత ప్రధానమంత్రిదే అని దీప్కే ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రిని తొలగించడం అనేది జవాబుదారీతనం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది తప్ప, బలహీనతను కాదు. ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో నిరాశ భావనలను మరింత పెంచుతుందని దీప్కే హెచ్చరించారు. ఈ విషయంలో ప్రధాని మోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన కోరారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇక ఏ యువత జీవితమూ అర్థాంతరంగా ముగిసిపోకుండా చూసేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలని దీప్కే లేఖలో కేంద్రాన్ని కోరారు. మా డిమాండ్‌ను వినిపించేందుకు జూన్ 20వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద సమావేశమవుతున్నారు. భారతదేశ భవిష్యత్తు గళాన్ని మీ ప్రభుత్వం ఆలకిస్తుందని మేము ఆశిస్తున్నాము అని ఆయన మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)