పోలింగ్ కేంద్రం గేటుకు తాళం
అభ్యర్థులు, ఏజెంట్లను పోలీస్ స్టేషన్ కు తరలింపు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య) : రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండల కేంద్రంలోని సంబేపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళిత మహిళా సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, వార్డు అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేసి, అభ్యర్థులు, ఏజెంట్లను లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో పాటు, వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు వీవీ ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను సైతం పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. శెట్టిపల్లి గ్రామపంచాయతీలో వైఎస్ఆర్సిపి మాజీ జడ్పిటిసి గొర్ల ఉపేందర్ రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేశారని గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని పట్టుకొని, వాహనం పైకి మహిళలు ఎక్కి నిరసన తెలిపారు. మిగిలిన గ్రామ పంచాయతీ లలో పోలీసులు నిష్పక్షపతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధిస్తారనే భయంతోనే తమ అభ్యర్థులను, ఏజెంట్లను పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే అవకాశం లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం పరిశీలించారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.









కామెంట్లు (0)