వాహనాలను వెంటనే ప్రారంభించాలని కోరిన క్లాప్ డ్రైవర్స్
బకాయి ఉన్న 18 నెలల పిఎఫ్, ఈఎస్ఐ వెంటనే చెల్లించాలి
ప్రజాశక్తి--కాకినాడ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ... కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసే క్లాప్ వాహన డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ .... గత 14 రోజుల నుంచి కాకినాడ నగరంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసే వాహనాలు నిలుపుదల చేశారని ఈ నిలుపుదల వల్ల నగరంలో ఎక్కడికి అక్కడ చెత్త పేరుకుపోయిందని అన్నారు. కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో క్లాప్ వాహనాల నిర్వహణ చేసే స్వయంభు కాంట్రాక్టు సంస్థ వారికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు బిల్స్ బకాయి ఉన్నవని ఈ బకాయి వల్లే తాము వాహనాలను తిప్పలేకపోతున్నామని స్వయంభు కాంట్రాక్టు వారు చెబుతున్నారన్నారు. మరోపక్క క్లాప్ డ్రైవర్లకు 18 నెలల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల జీతాల నుంచి మినహాయించుకున్న గాని కార్మికుల ఖాతాలకు జమ చేయడం లేదన్నారు. 14 రోజుల నుంచి తడి చెత్త పొడి చెత్త వాహనాలు నిలుపుదల చేయడం వల్ల కార్మికులకు డ్యూటీ లేదు, జీతం కూడా లేదని వాపోయారు. నగరంలో క్లాప్ వాహనాలు తిరగకపోవడం వల్ల చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని వర్షాలు కూడా పట్టడంతో మరింత ఎక్కువగా ఉందని అన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యాలపై పడుతుందని తెలియజేశారు. తక్షణమే ఉన్నతాధికారులు, కలెక్టర్ ఈ విషయంలో కలగజేసుకుని క్లాప్ వాహనాలను వెంటనే నగరంలో తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ నందు అందించగా కలెక్టర్ మాట్లాడుతూ ... ఈ సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులతో మాట్లాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, ఇస్మాయిల్, గంగాధర్, అరుణ్ కుమార్, కుమార్, శ్రీను, రమణ, రాజు, టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)