జెనీవా : స్విట్జర్లాండ్ లో అమెరికా, ఇరాన్ ల మధ్య ప్రారంభమైన ఉన్నతస్థాయి చర్చల మొదటి రోజున `ఆశాజనక పురోగతి' కనిపించిందని ఖతార్, పాకిస్థాన్ లు పేర్కొన్నాయి. 60 రోజుల్లోగా తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఒక రోడ్ మ్యాప్ కు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపాయి. ఇరుదేశాల ఉన్నతాధికారులు లూస్నర్ సరస్సు సమీపంలో 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిపిన సమావేశం అనంతరం ఈ పురోగతి నమోదైందని వెల్లడించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జె.వాన్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్పర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ కూడా ఉన్నారు. 14 అంశాల అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై జూన్ 17న ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
లెబనాన్ లో ఇజ్రాయిల్ సైనిక కార్యకలాపాలను ముగించే లక్ష్యంతో ``సంఘర్షణ నివారణ విభాగాన్ని '' ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత స్థాయి కమిటీ, సంప్రదింపులు, చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఖతార్, పాకిస్థాన్ లు జారీ చేసిన సంయుక్త ప్రకటన తెలిపింది. "మధ్యవర్తిత్వ ప్రక్రియపై రాజకీయ పర్యవేక్షణ" కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారని, 60 రోజుల్లోగా తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఒక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడానికి ఈ కమిటీ అంగీకరించిందని పేర్కొంది. అలాగే రాబోయే రెండు నెలల పాటు మరిన్ని సాంకేతిక చర్చలు కొనసాగుతాయని ఆ ప్రకటన పేర్కొంది. " చర్చల ప్రతినిధులు ఉన్నత స్థాయి కమిటీకి క్రమం తప్పకుండా నివేదికలు అందిస్తారు. అలాగే, అవగాహన ఒప్పందం (ఎంఒయు) సమర్థవంతమైన అమలును నిర్ధారించేందుకు అణు అంశాలు, ఆంక్షలు, పర్యవేక్షణ, వివాద పరిష్కారానికి సంబంధించిన కార్యవర్గాలకు, ఇతర అంశాలకు నాయకత్వం వహిస్తారు" అని పేర్కొంది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్థారించడానికి ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అంగీకరించినట్లు తెలిపింది.
లెబనాన్ యుద్ధం ముగించే దిశగా పురోగతి : అబ్బాస్ అరాగ్చీ
లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా పెద్ద పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. అయితే ఈ ఒప్పందానికి `లెబనాన్ సంఘర్షణ నివారణ విభాగం' సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అనేది అసలైన పరీక్షని పేర్కొన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఆంక్షలను ఎత్తివేశారని, దిగ్బంధనాన్ని తొలగించారని, స్తంభింప చేసిన కొన్ని ఇరాన్ ఆస్తులను విడుదల చేశారని ఆయన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇరాన్ కోసం ప్రధాన పునర్నిర్మాణ, అభివృద్ధి ప్రణాళికను ప్రారంభించారని అరాగ్చీ ఆ పోస్టులో తెలిపారు.
పరిష్కారం కాని కీలక సమస్యలు : నిపుణులు
లెబనాన్ విషయంలో, అణు సమస్యలపై పరిష్కారం కాని ప్రశ్నలు శాశ్వత ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలను క్ష్లిష్టతరం చేయవచ్చని నిపుణులు హెచ్చరించారు. సాంకేతిక చర్చల తదుపరి దశ రాజకీయ ఒప్పందం కంటే చాలా క్లిష్టమైనదిగా మారవచ్చని, అలాగే మధ్యంతర ఒప్పందంలో నిర్దేశించిన 60 రోజుల గడువు కంటే దీనికి ఎక్కువ సమయం పట్టవచ్చని
అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన నిపుణులు థామస్ వారిక్ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఇరాన్ యురేనియం నిల్వలు కొనసాగించేందుకు అనుమతిస్తారా లేదా, ప్రస్తుత యురేనియం నిల్వల పరిస్థితి, అంతర్జాతీయ తనిఖీల పరిధి, ఆంక్షల ఉపశమనానికి కాలపరిమితి వంటి ప్రశ్నలకు సమాధానం లేకుండానే ఒప్పందం కుదిరిందని అన్నారు.








కామెంట్‌లు (0)