ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ యనమదల చేసిన కీలక పరిశోధన ప్రతిష్ఠాత్మక ( Journal of Primary Care Specialties'( తాజా సంచిక (మే–ఆగస్టు 2026)లో ప్రచురితమైంది. లక్ష్మీ వైద్యశాల వేదికగా జరిగిన ఈ అధ్యయనంలో, కోవిడ్-19 వల్ల శరీరంలో జరిగే మార్పులను (విపరీతమైన వాపు, రక్తం గడ్డకట్టడం, బాక్టీరియా ఇన్ఫెక్షన్) అరికట్టేందుకు ఆస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, అజిత్రోమైసిన్ మందులతో కూడిన ప్రత్యేక చికిత్స విధానాన్ని డాక్టర్ మురళీకృష్ణ ఏప్రిల్ 2021లో సోషల్ మీడియాలో ప్రచురించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో గొప్పగా ప్రాచుర్యం పొందింది. అవే మందులను తన వద్దకు వచ్చిన పేషంట్లకు ఇచ్చి పరిశీలించారు. అప్పట్లో విస్తృత వినియోగంలో వున్న మెడికల్ కిట్, డాక్సీసైక్లిన్, ఐవర్‌మెక్టిన్, పారాసిటమాల్, వాడిన 60 మంది రోగులతో, ఈ ప్రత్యేక విధానాన్ని పాటించిన మరో 60 మంది రోగుల ఫలితాలను ఈ పరిశోధనలో సరిపోల్చారు. డాక్టర్ యనమదల చికిత్సా విధానంలో రోగులు త్వరగా కోలుకున్నారని, కేవలం 1.7 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సాధారణ చికిత్స తీసుకున్నవారిలో 13.3 శాతం మంది ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాకుండా, కోవిడ్ తర్వాత వేధించే నీరసం, పొడి దగ్గు లాంటి సమస్యలు కూడా ఈ విధానం ద్వారా గణనీయంగా తగ్గాయని డాక్టర్ మురళీకృష్ణ యనమదల ఆధారాలతో సహా అంతర్జాతీయ వైద్య సమాజానికి వివరించారు. కోవిడ్ పీడ కాలంలో డాక్టర్ యనమదల సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రజలకు నమ్మకమైన, శాస్త్రీయ సమాచారాన్ని విస్తృతంగా అందించి, ప్రజల్లో భరోసా నింపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు, ప్రాథమిక స్థాయిలో వైద్యం అందించడానికి ఆసుపత్రులపై భారం తగ్గించడానికి ఈ పరిశోధన ఒక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ యనమదల మన దేశీయ పరిస్థితులను గమనంలో ఉంచుకొని, ప్రపంచ జ్ఞానంతో తగిన చికిత్సా రీతులు రూపొందించడంలో విశేషమైన కృషి చేస్తున్నారు. ఎయిడ్స్ చికిత్సలో ఇరవై ఐదేళ్ల సరికొత్త విధానాలను ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.
కోవిడ్ చికిత్సా విధానం - డాక్టర్ యనమదలకు అంతర్జాతీయ జర్నల్‌లో చోటు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 03:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)