గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇస్రో నావిక్ కు తాత్కాలిక ఎదురుదెబ్బ ! ?

01 ఆగస్టు, 2026

A temporary setback for ISRO's NavIC!?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్' ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన నిర్ధారణ సేవలు అందించే సామర్థ్యాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించింది. నావిక్ వ్యవస్థ ద్వారా స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సేవలు అందించాలంటే కనీసం నాలుగు పనిచేసే ఉపగ్రహాలు కక్ష్యలో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఐఆర్ఎన్ఎస్-ఎస్-1బీ, ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ, ఎన్వీఎస్-01 ఉపగ్రహాలు మాత్రమే పనిచేస్తుండటంతో స్వతంత్ర నావిగేషన్ సేవలు అందించడం సాధ్యం కావడం లేదని కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 2016 మార్చిలో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం తన నిర్దేశిత పదేళ్ల సేవా కాలాన్ని పూర్తి చేయడంతోపాటు అందులోని అణు గడియారం పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయితే సమయ నిర్ధారణ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నావిక్ సంకేతాలను వినియోగించే పరికరాలు జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్ తదితర అంతర్జాతీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థల సంకేతాలను కూడా స్వీకరించే బహుళ నావిగేషన్ విధానంపై పనిచేస్తుండటంతో సాధారణ వినియోగదారులు, మొబైల్ ఫోన్లు, విమానయానం, నౌకాయానం, రైల్వే సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం తెలిపింది. భారత సాయుధ దళాల కార్యకలాపాలపైనా ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నావిక్ వ్యవస్థను తిరిగి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్వీఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉండగా, ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 ఉపగ్రహాలు తయారీ చివరి దశలో ఉన్నాయని వెల్లడించింది. భారత భూభాగంతో పాటు సుమారు వెయ్యిన్నర కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన నావిగేషన్ సేవలు అందించేందుకు రూపొందించిన నావిక్ వ్యవస్థలో ఏర్పడిన ఈ లోటు తాత్కాలికమేనని, కొత్త ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన తర్వాత స్వతంత్ర నావిగేషన్ సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్