mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సమావేశాలు

5 రోజుల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 11:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యారంగ సమస్యలపై పోరాట కార్యాచరణ

  • విజయనగరం జిల్లా కమిటీ పిలుపు..

  • గోడపత్రిక ఆవిష్కరణ

ప్రజాశక్తి – విజయనగరం టౌన్: జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. చినబాబు, డి. రాము పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎల్‌బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షలను పలుమార్లు వాయిదా వేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. సీబీఎస్‌ఈ, సీయూఈటీ పరీక్షలను సాంకేతిక సమస్యల నేపంతో వాయిదా వేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సాకులు చెపుతూ విద్యార్థులకు సకాలంలో అందజేయాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను పంపిణీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా నేటికీ ప్రభుత్వ వసతి గృహాలను (హాస్టళ్లను) పూర్తిస్థాయిలో తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఒకే రిజిస్ట్రేషన్‌తో రెండు కాలేజీలు నడుపుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ‘స్మార్ట్ కిచెన్’ల పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి, ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వారు విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించేందుకే విశాఖలో ఈ కేంద్ర కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశాలకు ప్రజలు, మేధావులు, విద్యార్థులు హార్దిక, ఆర్థిక సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కేంద్ర కమిటీ సమావేశాలకు సంబంధించిన గోడ పత్రికను (పోస్టర్‌ను) నాయకులు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె. జగదీష్, ఆర్. శిరీష, ఎస్. సోమేష్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్