" మాకు గొప్ప షాకై పోయింది నారాయణమూర్తి గారూ! మా పాతృడు ఏదో కామిడీగా అన్నాడనుకున్నాం.. అందరిలాగే నవ్వీసుకున్నాం.. పెదబాబు ఇలాగ నిజం సేసేస్తాడని.. అస్సలు ఊహించలేదు.. ఏం రా పరదేశీ! "
" పెరటి మొక్క వొయిద్యానికి పనికిరాదు.. అనుకునే బాపతుల్లో ..మనమున్నూ! అలాగా.. అలవాటైన ఏరియా పోలిటిక్సు..సిటీలో వుంటే అప్పోజిషనోలి సీను.. రోజుకొకటి సింపీయ్యిడూ! "
" ఐనా, సంపద సృష్టించడమంటే..ఇలాంటివేనండీ! ఎన్ని రోజులు అప్పులు తెచ్చుకోవడం?"-- నారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.
" జోకీగా సెప్పినా, టూకీగా సెప్పీసీనాడు మావోడు! ఈ షాకుతో పాటు.. మరొక షాకు..మా సినబాబుని ఎకాఎకీన తీస్కెళ్లిపోయి, పెదబాబుల సభలో కూకోబెట్టీడం!"
" మీ వాడికి ఆ సంగతి ముందే తెలుసు లే!"--నవ్వుతూ, నాయుడు ముఖం చూశాడు మూర్తి.
" మా వోడిలాగా..వొయిజాగ్ ఎంపీగోరు..బరతబాబుకీ మంచి మందుసూపు వుంది సారూ! ప్రెభుత్వం బతుకు.. మందు దుకాణాల గల్లాపెట్టెల్లోనే కొట్టుకుసస్తంది గదా! యెధార్ధం సెప్పాడు..ఎయ్యెకరాలు సల్లగా ఆక్రమించీసి.. ఎల్లకాలం ఎంపీగా జీవించాలా! పరదేశి గాడి దీవన పరబ్రెమ్మ దీవన "--పైనుంచి ఎప్పుడు కిందకు దించీశాడో..పావు ఖాళీ..తలకింద చెయ్యిపెట్టి పాలసముద్రం మీద.. పెద్దాయన ఫోజు!
అది చూసి, మిగిలినోళ్లు షాకై..ఉపక్రమించారు కార్యానికి.
" మూర్తి గారూ! ఐడియా ఇచ్చిన మా పాత్రుడికి గానీ, సపోర్ట్ సేసిన భరత బాబుకి గానీ.. ఈ షాక్సు పర్మిట్లు ఇస్తారా!?"
" ఏటిక్కడా .. బెల్టు షాపులు పెట్టించేత్తావేటి?"-- కిచ కిచా నవ్వాడు పరదేశి. టేబుల్ కింద నుంచి, ఒక్క తన్ను తన్నాడు నాయుడు.
" ఓన్లీ, టూరిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. అందుకే కదా, ఎంటరవడానికి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. భోగాపురం ఓపెనింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. విశాఖ ఎయిర్ పోర్ట్ క్లోజ్ అయిపోతే, ఈ రోడ్ లోనే జనాలు వెళ్ళాలి."--మూర్తి చెప్పాడు. టూరిజం ప్రాజెక్టు ప్లానింగ్ కోసమే రుషికొండ- రామానాయుడు స్టూడియో మధ్య
' ఉండి' మీసాల రాజు గారి విల్లాలో, మీటింగ్ పెట్టుకున్నారు.
" అటు రామకృష్ణ బీచండీ.. రామకృష్ణ పరమహంస గారి మఠమండీ.. తర్వాత, బీచ్ పడమట పక్క పెద్ద పెద్ద వాళ్ల విగ్రహాలండీ.. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి వుడా పార్కండీ.. మీద కొండమీద.. కైలాస నాధుడండీ.. దిగువన.. ఎదురుగా, తెన్నేటి విశ్వనాథం పార్కండీ.. ఈ బీరు షాపులు ఎక్కడ పెట్టేసి, జనానికి షాకిస్తారండీ!"-- రాజు గారి బాణీలో రాజుగారు చెప్పారు.
" రుషికొండ నుంచి భీమిలి కొండ వరకు చాలా బీచ్లు ఉన్నాయి కదండీ!"-- బుస్సీ గుర్తు చేశాడు.
" పోలీసుల గొడవలు గట్రా ఉంతాయేటో! ఆలొచ్చి కర్రలు బుర్రలమీదెడితే, ఎవుడు హేపీగా తాగ్గలడూ!"--పరదేశి డౌట్, మిగిలిన వాళ్ళకీ వచ్చింది.
" ఇది టూరిజం సార్! ఇక్కడ ఏది చేసినా చెల్లిపోతుంది. పోలీసులే మనకు సెక్యూరిటీ!"--నవ్వాడు నారాయణమూర్తి.
" మరింకేమీ! గోవా దేనికి పనికొస్తుంది? వొయిజాగు లేండు..ఇకన థాయిలాండే! భోగాపురం జిఎంఆర్ కి దిమ్మ తిరిగిపోద్ది గావాల!"
ఎయిర్ పోర్టు.. మూలపేట పోర్టు కట్టింది.. థాయిలాండ్.. వెళ్లడానికి కాదు.. వాటికి వేరే ప్యాసింజర్స్ ఉన్నారు."-- మూర్తి గుంభనంగా నవ్వాడు.
" ఏటి ఏదైపోతే ఏటీ! మా పాత్రుడు నోటి వాక్కు ఫలించింది.. అంతే మాకు సాలు.. ఆ వన్ బై సెవెంటీ ఏక్టు కూడా మా పాతృడి నోటి సలవ వల్ల.. రద్దైపోతే బాగున్ను! అయిపోద్దిలేండి.. మా పాత్రుడి పక్కన ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ లేదు.. తధాస్తు దేవతలు తిరుగుతున్నారు.. అన్నది.. అయిపోద్ది.. తిరుగులేదు"-- పరదేశి వందన సమర్పణ స్టేజ్ కి వచ్చేసాడు.
" మీ పాత్రుడు అంటే జరిగిపోయింది అనుకుంటున్నావా! అన్నవారు పాత్రులు వారు.. అనిపించినవారు.. మన పెద బాబు గారు"-- పగలబడి నవ్వాడు నారాయణమూర్తి.
అందరికీ పెద్ద షాక్! .. కొంచెం సేపు నిశ్శబ్దం.. పరదేశికి కొంత మత్తు వదిలింది. పైకి లేచి--
" హమ్మ పెదబాబూ.. సుట్టంతో పాముని సంపించడమంటే.. ఇదే గదా!"-- దబ్బున కింద పడిపోయాడు.
- ' నల్లి ' కుట్టు







కామెంట్‌లు (0)