ఇంటర్నెట్ : దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూసిన సంగతి విదితమే. ప్రముఖ సీనియర్ సినీనటి రాధికను స్టార్ హీరోయిన్గా తీర్చిదిద్దిన గురువు భారతీరాజా. ఆయనపై రాధికకు అపారమైన గౌరవం ఉంది. భారతీరాజాను తన గురువుగా భావించే సీనియర్ సినీనటి రాధిక సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనపై ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ తాజాగా వరుస పోస్టులు పెట్టారు. ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘మీరే నా సర్వస్వం..’ మీరు లేరని తెలిసి నా హృదయం ముక్కలైంది… అని భావోద్వేగంతో పోస్టులో పేర్కొన్నారు.
‘‘నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు ఇద్దరు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్లే. ఒకరు నా తల్లి, మరొకరు నా గురువు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే వీళ్లిద్దరినీ నేను కోల్పోయాను. ఈ వేదనను మాటల్లో వివరించలేకపోతున్నాను. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. హృదయం బరువెక్కింది. నా బాధను అర్థం చేసుకుని, నాతో పాటు నిలబడి, అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను. వారి జ్ఞాపకాలు, వారు నాకు నేర్పిన జీవిత పాఠాలు నాతో ప్రయాణిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఇక సినీ వేడుకల్లో భారతీరాజా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన వీడియోను ఆమె పంచుకున్నారు. ‘భారతీరాజా సర్.. మీరే నా సర్వసం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని క్యాప్షన్ పెట్టారు.
రాధికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’తో దర్శకుడిగా మారిన ఆయన తన రెండో సినిమా ‘కిళక్కే పొగమ్ రైల్’తో రాధికను నటిగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమెను స్టార్ హీరోయిన్గా తీర్చిదిద్దిన గురువుగా భారతీరాజాపై రాధికకు అపారమైన గౌరవం ఉంది. ఆయన కూడా తన విజయాల్లో రాధిక భాగమని ఎప్పుడూ చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. ‘వస్తే మీ పాదాల దగ్గర పెడతాను’ అని ఆమె తన గురువుపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాధిక షేర్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/reel/DZZAIWMuvu4/?utm_source=ig_web_button_share_sheet










కామెంట్లు (0)