న్యూఢిల్లీ : మతబోధన చేసే విద్యాసంస్థల అంశంపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. మత బోధన చేసే పాఠశాలలను రాజ్యాంగ నిబంధనలను అనుసరించి మతసంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలుగా పరిగణించాలా లేకుంటే `లౌకిక లేదా వృత్తి విద్యా సంస్థలు’గా పరిగణించాలా అన్న అంశాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశం విద్యాశాఖ పరిధిలోకి వస్తుందని, కోర్టు ప్రస్తుతం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఏదైనా మతాన్ని ప్రోత్సహించడానికి మతపరమైన బోధనలు చేసే ఏ సంస్థ అయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 26(ఎ) పరిధిలోకి వస్తుందని, ఆర్టికల్ 19(1)(జి) లేదా ఆర్టికల్ 30(1)పరిధిలోకి రాదని ప్రకటించాలని కోరుతూ పిటిషనర్ , న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 26(ఎ) మతస్వేచ్ఛ హక్కులలో ఒకటి. ఈ సెక్షన్ ప్రకారం.. ఒక మత సంస్థలేదా దానిలో ఏదైనా విభాగం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి హక్కును కలిగి ఉంటుంది. ఈవిధంగా ప్రకటిస్తే.. మత బోధన చేసే పాఠశాలలు ప్రజా భద్రత, ఆరోగ్యం, నైతికతకు సంబంధించిన పరిమితులకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులకు విద్యను అందించే సంస్థలను నమోదు చేయడానికి, గుర్తించడానికి, పరిరక్షించడానికి, పర్యవేక్షించడానికి కేంద్రం ఒక యంత్రాగాన్ని కలిగి ఉండాలని ఉపాధ్యాయ పిటిషన్ లో కోరారు. ఇది జాతీయ భద్రతా సమస్య అని వాదించారు. చిన్నారులు దేశ భవిష్యత్తుకు నిర్మాతలని, నమోదు కాని సంస్థలలో వారి మేధస్సును కలుషితం చేయవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చని పిటిషన్ లో పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)