mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జి7కు నిరసన సెగ

2 రోజుల క్రితం

g7
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:43 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కూటమికి వ్యతిరేకంగా నినాదాలు
- టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ ‌కెనన్లు ప్రయోగించిన పోలీసులు
​జెనీవా : ఫ్రాన్స్‌‌లో సోమవారం జి7 శిఖరాగ్ర సమావేశం జరగడానికి ముందు ఆదివారం స్విట్జర్లాండ్‌‌లోని జెనీవా నగరంలో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ప్రదర్శనలు జరిపారు. ‘నో జి7’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసనకారులు ఈ ఆందోళనలో పాల్గొని, జి7 సదస్సుకు వ్యతిరేకంగా నినాదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష‍ుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‌తీరును తీవ్రంగా నిరసించారు. ఈ నిరసనలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ ‌కెనన్లను ప్రయోగించారు. ఫ్రాన్స్‌ ‌సరిహద్దుకు సమీపంలోని జెనీవాలో నిర్వహించిన ఈ నిరసనలో సుమారు 20వేల మంది పాల్గొన్నట్టు పోలీసులు అంచనా వేశారు. ఈ ఆందోళనల్లో యుఎన్‌ ‌కార్యాలయాలు, ప్రయివేటు సంస్తలపై దాడులు జరిగినట్టు తెలిపారు. అయితే భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి యూరోపియన్‌ ‌ప్రధాన కార్యాలయానికి నిరసనకారులు చేరుకోలేకపోయారని చెప్పారు. నిరసనకారులు తిరిగి జెనీవా సరస్సు తీరంలోని పార్కుకు చేరుకున్న తర్వాత కూడా పోలీసులతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

​శాంతియుతంగా ప్రారంభమై హింసాత్మకంగా మారి..
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ నిరసన ర్యాలీ మొదట శాంతియుతంగా సాగింది. ‘జి7కు, సామ్రాజ్యవాద కూటములకు వ్యతిరేకం’, ‘జి7ను రద్దు చేయాలి’ వంటి నినాదాలతో ఆందోళనకారులు బ్యానర్లు ప్రదర్శించారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నినాదాలు చేశారు. వాతావరణ మార్పులపై చర్యలకు డిమాండ్‌ ‌చేశారు. స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధాన వ్యతిరేక ఉద్యమాలకు మద్దతుగా నినాదాలు వినిపించారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. కొందరు నిరసనకారులు దారి వెంట ఏర్పాటు చేసి ఉన్న భద్రతా అవరోధాలను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక టెస్లా కారును కూడా దహనం చేశారు.
​‘మా జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటున్నారు’
జి7లోని దేశాల తీరుపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా జెండా పట్టుకొని నిరసనలో పాల్గొన్న 69 ఏండ్ల స్విస్‌ ‌రిటైర్డ్‌ ఉద్యోగి మిషెల్‌ ‌మాట్లాడుతూ.. ‘‘మా జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలను తీసుకోవడానికి ప్రపంచ నాయకులు ఇక్కడ సమావేశం అవుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకే నేను ఈ నిరసనలో పాల్గొటున్నాను’’ అని ఆయన తెలిపారు. సుమారు 200 యూనియన్లు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలతో కూడిన కూటమి ఈ నిరసనను నిర్వహించింది. జి7 దేశాల విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిస్పందన అవసరమని నిర్వాహకులు తెలిపారు. ‘నో జి7’ కూటమికి చెందిన లారే అనే కార్యకర్త మాట్లాడుతూ.. “అధికారులు సృష్టించిన భయాందోళనల కారణంగా చాలామంది నిరసనకు దూరంగా ఉన్నారు. నిరసనలో భాగంగా పిల్లల కోసం బుడగలు తయారుచేసే వాహనం, డ్రమ్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం” అని చెప్పారు. నిరసన ర్యాలీ చివర్లో ట్రంప్ బొమ్మను భారీ ఆకారంలో రూపొందించి ప్రదర్శించారు. ఆయన కండ్ల నుంచి, నోటి నుంచి రక్తం కారుతున్నట్టు ఎరుపు రంగుతో చిత్రీకరించి, చేతిలో ‘క్యూబా’ అని రాసిన గ్లాస్‌ను ఉంచడం విశేషంగా నిలిచింది.

​‘ప్రపంచాన్ని యుద్ధాల వైపు నెడుతున్నారు’
‘నో జి7’ కూటమి ప్రతినిధి ఫ్రాంకోయిస్ నైఫెలర్ మాట్లాడుతూ.. “ట్రంప్‌తో పాటు జీ7 నాయకుల విధానాలపై మాకు తీవ్ర ఆందోళన ఉంది. వారు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. భూమి ప్రమాదంలో ఉంది. అందుకే ప్రపంచ ప్రజలు వారి విధానాలను వ్యతిరేకిస్తున్నారని తెలియజేయడానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం” అని అన్నారు. జి7 దేశాల కూటమి ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించడం లేదనీ, వారి విధానాలు వాతావరణ మార్పులు, సామాజిక సమానత్వం, పేదరికం వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. జీ7 అనేది ధనికులు మరింత ధనికులు కావడానికి, పేదలు మరింత పేదలు కావడానికి ఉపయోగపడే వేదిక అని విమర్శించారు.

​జి7 ప్రాధాన్యంపై ప్రశ్నలు
అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ దేశాలతో కూడిన జి7 కూటమి ప్రాతినిధ్యంపై ఇటీవలి కాలంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 70 శాతం వాటా కలిగిన ఈ దేశాల వాటా ప్రస్తుతం 40 శాతానికి తగ్గిపోయింది. ప్రపంచ జనాభాలో కేవలం పదో వంతు మాత్రమే ఈ దేశాల్లో నివసిస్తున్నారు. ఇదే సమయంలో భారత్, చైనా, రష్యా తదితర దేశాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి సభ్యత్వాన్ని 5 నుంచి 11 దేశాలకు విస్తరించడంతో ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్