సూపర్ మార్కెట్‌కు వెళ్లగానే రంగురంగుల ప్యాకెట్లు ఆకర్షిస్తుంటాయి. రుచికరమైనవంటూ ఊరించే ప్రకటనలు, ఆకట్టుకునే ప్యాకేజింగ్ చూసి చాలామంది వాటిని కొనేస్తుంటారు. ఇలాంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటి వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆహారంలో చక్కెర, ఉప్పు, కొవ్వు అవసరమే. అయితే అవి మోతాదుకు మించితేనే సమస్య. ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్, తీపి పానీయాలను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అనవసరమైన కేలరీలు చేరుతాయి. చక్కెర అధికంగా ఉండే పదార్థాలతో బరువు పెరగడం, ఊబకాయం, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పులోని సోడియం అధికంగా శరీరంలోకి చేరితే రక్తపోటు పెరుగుతుంది. సంతృప్త కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉండే ఆహారం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది.
ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సూచనలు
ప్యాకెట్ వెనుక ఉండే పోషక విలువలు, పదార్థాల జాబితాను చదవాలి. చక్కెర, సోడియం, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయో పరిశీలించాలి.
కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర కలిగిన ప్యాకేజ్డ్ జ్యూస్‌లను తగ్గించాలి. పండ్ల రసాలకంటే పండ్లను నేరుగా తినడానికే ప్రాధాన్యమివ్వాలి.
చిప్స్, నమ్కీన్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, సాస్‌ల వినియోగాన్ని తగ్గించాలి.
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కెట్లు, కేకులు, బేకరీ పదార్థాలను మితంగా తీసుకోవాలి.
ఒక ప్యాకెట్‌లో ఎన్ని సర్వింగ్స్ ఉన్నాయో చూడాలి. ఒక సర్వింగ్‌కు ఇచ్చిన పోషక విలువలను మొత్తం ప్యాకెట్‌కు వర్తింపజేయకూడదు.
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, గింజలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2024లో విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహారాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని పేర్కొంది.








కామెంట్‌లు (0)