కోజికోడ్:
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎరంజిమావు ప్రాంతానికి చెందిన 71 ఏళ్ల వృద్ధురాలి కంటిలోంచి వైద్యులు ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవున్న సజీవ పురుగును బయటకు తీశారు.
గత మూడు రోజులుగా కంటిలో ఏదో అడ్డుపడుతున్నట్లుగా, కన్ను ఎర్రగా మారి తీవ్ర ఇబ్బంది కలుగుతుండటంతో సదరు వృద్ధురాలు కొడియత్తూరులోని కామ్‌ట్రస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కంటిలోని తెల్లటి భాగం కింద ఒక పెద్ద పురుగు కదులుతున్నట్లు గుర్తించారు.
వెంటనే డాక్టర్ ఇ. వరుణ్ హరీష్ నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించి ఆ పురుగును సురక్షితంగా బయటకు తీసింది. 'డైరోఫైలేరియా' (Dirofilaria) జాతికి చెందిన పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇవి కంటికి చేరుకుంటాయని డాక్టర్ వరుణ్ హరీష్ వివరించారు. ముఖ్యంగా దోమల కాటు ద్వారా మరియు పెంపుడు జంతువుల పెంపకం, వాటి సంరక్షణ సమయంలో ఈ కీటకాలు మనుషుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)