తమిళనాడు : తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (TNSTC) చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. పుదుక్కోట్టై జిల్లాకు చెందిన శ్రీదేవి అనే ట్రాన్స్‌జెండర్ రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా నియమితులయ్యారు. అత్యంత రద్దీగా ఉండే తిరుచ్చి-రామేశ్వరం రూట్లో ఆమె బస్సు నడుపుతూ ప్రయాణికుల ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో ఇదే సంస్థలో కళాదేవి అనే ట్రాన్స్‌జెండర్ తొలి కండక్టర్‌గా చేరగా.. ఇప్పుడు శ్రీదేవి నియామకంతో ప్రభుత్వ రంగంలో ట్రాన్స్జెండర్ల సాధికారత, సమానత్వానికి తమిళనాడు ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లయింది.
చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సమాజపు వివక్షలను ఎదుర్కొంటూ ట్రాన్స్‌జెండర్ శ్రీదేవి తన కలను సాధించుకున్నారు. డ్రైవింగ్ పట్ల ఆమెకు ఉన్న మక్కువతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నారు. కఠినమైన పరీక్షలు అన్నీ ఉత్తీర్ణులై లైసెన్స్ సాధించి, ఇప్పుడు ప్రభుత్వ బస్సును నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె పుదుక్కోట్టై కొత్త బస్టాండ్ నుంచి తిరుచిరాపల్లి వరకు ఉన్న రద్దీగా ఉండే రూట్లో బస్సును నడుపుతున్నారు.
ఆమె డ్రైవింగ్ కు ప్రయాణీకులు ఫిదా ..!
తిరుచ్చి-రామేశ్వరం మార్గం చాలా రద్దీగా ఉండే రూట్ కావడంతో ఆమె డ్రైవింగ్ నైపుణ్యం, సమయపాలన, సురక్షిత డ్రైవింగ్ శైలి ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తోటి ఉద్యోగులు కూడా ఆమెను గర్వంగా చూస్తున్నారు. శ్రీదేవి ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్‌గా పని చేస్తున్నా, ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి స్థానికులు, ప్రయాణికులు ఆమెను శాశ్వత ఉద్యోగిగా చేయాలని రవాణా శాఖను కోరుతున్నారు.
ట్రాన్స్ జెండర్ల సాధికారతలో ముఖ్యమైన అడుగు ..!
ఈ విజయం రాష్ట్రంలోని ఎంతో మంది ట్రాన్స్‌జెండర్ సోదరులు, సోదరీమణులకు పెద్ద స్ఫూర్తి అవుతోంది. లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే ఏ రంగంలోనైనా రికార్డులు సృష్టించవచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది. గతంలో అదే పుదుక్కోట్టై జిల్లాకు చెందిన కళాదేవి అనే ట్రాన్స్‌జెండర్ ఇదే TNSTCలో తొలి కండక్టర్‌గా నియమితులై సంచలనం సృష్టించారు. ఇప్పుడు శ్రీదేవి డ్రైవర్‌గా వచ్చడంతో ట్రాన్స్జెండర్ల సాధికారతలో మరో ముఖ్యమైన అడుగు పడింది.
మాకెంతో స్ఫూర్తి : మహిళా ప్రయాణీకులు
ముఖ్యంగా మహిళా ప్రయాణికులు శ్రీదేవి విజయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒక ట్రాన్స్ మహిళ ఇంత పెద్ద బస్సును ఆత్మవిశ్వాసంతో నడపడం చూసి తమకు ఎంతో స్ఫూర్తి అందుతోందని వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ విధంగా సామాజిక సమానత్వం వైపు చేస్తున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ సాధన ట్రాన్స్‌జెండర్ సమాజానికి మాత్రమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానత్వం, అవకాశాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. శ్రీదేవి లాంటి వ్యక్తులు ముందుకు వస్తే సమాజం మరింత ముందుకు సాగుతుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.








కామెంట్లు (0)