mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలుగులోకి మధ్యప్రదేశ్‌ సిఎం ‘భూదందా ’

1 గంట క్రితం

madyapradesh cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 06:07 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఉజ్జయినీ అభివృద్ధి పేరిట సిఎం ఘరానా మోసం

న్యూఢిల్లీ : ఉజ్జయినీ అభివృద్ధి పేరిట మధ్యప్రదేశ్‌ సిఎం భూదందాకి పాల్పడ్డారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కింద సిఎం, ఆయన కుటుంబం కోట్లాది రూపాయల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పరిశోధనాత్మక వార్తలో వెల్లడించింది. ఉజ్జయినీని పట్టణీకరించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునీకరణలో భాగంగా రహదారులు, హైవేలు మొదలుకొని, నివాస, వాణిజ్య స్థలాల విస్తరణకు వీలుగా కీలక మార్పులు ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ ఉజ్జయినీని దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో ఒకటిగా మార్చింది. వాస్తవానికి ఈ పేరుతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులు కూడా దీనిలో భాగస్వామ్యులుగా ఉన్నారు.


2023, డిసెంబర్‌ 13న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి, ఆయన కుటుంబం, వారి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఖరీదైన ప్రాంతాల్లో రూ.45 కోట్లు విలువ చేసే సుమారు 137 ప్లాట్లను (సుమారు 168 ఎకరాలు ) కొనుగోలు చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ భూ రికార్డుల పరిశీలనలో వెల్లడైంది. ఈ ప్లాట్ల లో సుమారు ఆరుప్లాట్లు తనంతరం విక్రయించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అధికారిక భూ రికార్డులు వెంటనే నవీకరించేందుకు వీలు లేకపోవడంతో 2026లో ఆ కుటుంబం జరిపిన లావాదేవీలు (ఒకవేళ విక్రయాలు, కొనుగోళ్లు ఉంటే) ఈ రికార్డుల్లో కనిపించలేదని తెలిపింది.


ఈ ప్లాట్లను మోహన్ యాదవ్ భార్య సీమ, కుమారుడు వైభవ్, ఆయన భార్య శాలిని యాదవ్, సోదరులు నంద్‌లాల్ మరియు నారాయణ్ యాదవ్, నారాయణ్ భార్య రేఖ, వారి కుమారుడు అభయ్ యాదవ్, అలాగే దగ్గరి బంధువులైన గోవింద్, నీలేష్ యాదవ్ కొనుగోలు చేసినట్లు అధికారిక భూరికార్డులు (ఖతౌనీ)లో ఉన్నట్లు తెలిపింది. వీరు వీటిని నేరుగా, ఆ కుటుంబం నిర్వహిస్తున్న నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకదాని ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ కొనుగోళ్లు నైతికత, ప్రయోజనాల సంఘర్షణకు సంబంధించిన రెండు ప్రశ్నలను లేవనెత్తాయి.


మొదటిది, ఈ స్థలాల్లో చాలా వరకు ఉజ్జయినీ పరిసరాల్లో ప్రకటించిన కొత్త రహదారి ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్నాయి. ఉజ్జయినీ మాస్టర్‌ ప్లాన్‌ 2023 ప్రకారం వ్యవసాయ భూమిని నివాస లేదా వాణిజ్య వినియోగం కోసం మార్చాలని నిర్ణయించిన ప్రాంతాల్లో ఉన్నాయి. యాదవ్‌ సిఎం కావడానికి కొన్ని నెలలముందు, 2023 మే నెలలో ‘ఉజ్జయినీ మాస్టర్‌ ప్లాన్‌ 2025 ’ విడుదలైనప్పటికీ, ఆయన ముందునుండి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక పదవులను చేపట్టారు. 2004-2010 మధ్య ఉజ్జయినీ అభివృద్ధి సంస్థ (యుడిఎ) చైర్మన్‌గా, 2011-13 మధ్య మధ్యప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎంపిటిడిసి) అధ్యక్ష‍ుడిగా, 2013 నుండి ఉజ్జయినీ (దక్ష‍ిణ ) నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 జనవరిలో ఆయన సిఎం అయిన వెంటనే, ప్రభుత్వం ఈ ప్రాంతంలోనే అనేక కొత్త రహదారి అనుసంధానాలు, జాతీయ రహదారులను ప్రకటించింది. ఇవి భవిష్యత్తులో ఆ ప్రాంతాల విలువను పెంచుతాయని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పేర్కొన్నారు. అలాగే భూవినియోగ మార్పుల వలన వ్యవసాయ భూములను నివాస లేదా వాణిజ్య అభివృద్ధికి అనుకూలంగా మార్చారని, దీంతో ఈ ప్లాట్లు తొలిదశ పెట్టుబడులకు అవకాశంగా మారాయని తెలిపారు.

రెండవది, మోహన్‌ యాదవ్‌ సిఎం కాకముందు ఉన్న వారి భూముల విలువ 2023 డిసెంబర్‌ తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. యాదవ్‌ కుటుంబం చేసిన కొనుగోళ్లు భూముల విలువను మరింత పెంచాయి. మోహన్‌ యాదవ్‌ కుమారుడు వైభవ్‌, సోదరి కలవతి కూడా సభ్యులుగా ఉన్న యాదవ్‌ కుటుంబం, ఉజ్జయినీ, పరిసర ప్రాంతాఓ్ల 179 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుమారు 108 ప్లాట్లను కలిగి ఉంది. వీటిలో సుమారు 85 ఎకరాలను యాదవ్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్న 2021-2023 మధ్య కాలంలో కొనుగోలు చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గుర్తించింది. అయితే మోహన్‌ యాదవ్‌ సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే వారి కుటుంబం పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

ఆయన సిఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాది నుండి 2025 డిసెంబర్‌ చివరినాటికి, ఆయన కుటుంబం, వారి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు సుమారు 137ప్లాట్లను (మొత్తం 168 కరాల విస్తీర్ణంలో ) కొనుగోలు చేశాయి. ఇందులో 12 ఎకరాలు యాదవ్‌ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అంతర్గత బదిలీలే కావడం గమనార్హం. ఈ విషయంపై స్పందించాల్సిందిగా పంపిన అనేక అభ్యర్థనలకు సిఎం స్పందించలేదు. అయితే సిఎం కుటుంబం వ్యాపార లేదా భూ లావాదేవీలను ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయానికి ముడిపెట్టడం సముచితం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.


2025లో, ఉజ్జయినీలో శాశ్వత కుంభమేళా మౌలిక సదుపాయాలను నిర్మించడానికి వ్యవసాయ భూములను సమీకరించాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ, యాదవ్ కుటుంబం, వారి కంపెనీలు 92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కనీసం 62 ప్లాట్లను కొనుగోలు చేశాయి. ఉజ్జయినీలో సిఎంకి నేరుగా సుమారు 17 ఎకరాల భూమి ఉంది. ఈ 17 ఎకరాలు తన ఆస్తి అని, వాటిలో వారసత్వంగా వచ్చినవి (4 ఎకరాలు), కొనుగోళ్లు (1998లో 13 ఎకరాలు)గా 2023లో ప్రకటించారు. ఆయన భార్య సీమా యాదవ్‌ పేరిట కనీసం 10.6 ఎకరాల భూమి ఉంది. దీనిని మోహన్ యాదవ్ 2023 ఆస్తి ప్రకటనలో కొనుగోళ్లుగా (2008-10) ప్రకటించారు. మోహన్ మరియు సీమా యాదవ్‌లు కలిసి 73శాతం వాటా కలిగి ఉన్న తమ కుటుంబ కంపెనీ ‘సిద్ధి వినాయక్ దేవ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా సుమారు మరో 39.5 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. దీనిలో, 12 ఎకరాలను 2024 సెప్టెంబర్‌లో సమీప బంధువు నీలేష్ యాదవ్‌కు విక్రయించారు. ‘సిద్ధి వినాయక్ దేవ్‌కాన్’ 2024-2025 మధ్యకాలంలో కనీసం మూడు ప్లాట్లను (2.6 ఎకరాలు) కొనుగోలు చేసింది. స్థానిక అధికారుల నుండి సేకరించిన వివరాలతో యాదవ్ కుటుంబం కొత్తగా కొనుగోలు చేసిన భూముల భౌగోళిక స్వరూపాన్ని మ్యాప్ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. యాదవ్ సిఎం అయినప్పటి నుండి ఆ కుటుంబం కొనుగోలు చేసిన 168 ఎకరాలలో, 111 ఎకరాలు యాదవ్ ప్రకటించిన ఉజ్జయినీ, దాని పరిసర ప్రాంతాలలోని రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకదాని పక్కనే ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ సిఎం మోహన్‌ యాదవ్‌ భూదందాపై ప్రతిపక్ష‍ాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపి ప్రభుత్వంలో అయోధ్య, ఉజ్జయినీ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక స్థలాలు కేవలం తీర్థయాత్ర ప్రాంతాలుగా మాత్రమే కాదు, ఆ పార్టీకి కామధేనువుల్లాగా మారాయని సిపిఐ(యం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు.ఇటీవల అయోధ్య విరాళాలు గల్లంతైన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్